
టీడీపీ మూకలు ఓటు వేసేందుకు రానివ్వడంలేదని, ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు వచ్చి కోరుతున్న కనంపల్లి గ్రామ మహిళలు
పులివెందుల మండల ఓటర్ల ఆక్రోశం, ఆందోళన, నిలదీత
జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటు వేయనివ్వని పచ్చ తాలిబన్లు
పోలింగ్ బూత్‌లన్నీ ఆక్రమించి యథేచ్ఛగా రిగ్గింగ్
అసలు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
తమను అడ్డుకోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా కనికరించని వైనం
బయటి నుంచి వచ్చిన పచ్చ మూకలు యథేచ్ఛగా దొంగ ఓట్లు
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా బెదిరింపులు
తుదకు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సైతం ఓటేయలేకపోయిన దుస్థితి
సాక్షి, అమరావతి/పులివెందుల : ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి.. మీ కాళ్లు పట్టుకుంటాం..’ అంటూ పులివెందుల మండల ఓటర్లు వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ నేతల అడ్డగోలు వ్యవహారాలు, దౌర్జన్యాలు, ఓట్లు కొల్లగొట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను విస్తుగొలుపుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయకుండా గ్రామాలకు గ్రామాలనే నిలువరించడం ఇప్పుడే చూస్తున్నామని పులివెందుల మండల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలంటే ఓటర్లందరూ వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. పోలింగ్ రోజున వృద్ధులు, నడవలేని వారిని పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది భుజాలపై మోసుకుని వెళ్లి ఓటు వేయించడం గతంలో అందరూ చూశారు. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఇలాంటి ఘటన మచ్చుకు ఒక్కటి కూడా కనిపించలేదు. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ పచ్చ తాలిబన్ల అరాచకం రాజ్యం ఏలింది.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ బూత్‌ల వరకూ వెళ్లనివ్వకుండా పోలీసులే చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో మేం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాం.. మా ఓట్లన్నీ ఏమయ్యాయ్? అని పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని ఓటర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడికక్కడ అడ్డగింత
ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నిక జరిగితే ఘోర పరాజయం తప్పదని ముందే పసిగట్టిన చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలు పన్నిన విషయం తెలిసిందే. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను మరో గ్రామానికి మార్చేసి, ఓటర్లు ఓటు వేయడానికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు పన్నాగంలో భాగంగా ఓటర్లు పక్క ఊరికి వెళ్లి ఓటు వేయకుండా పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి నిలువరించారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. ఓటర్లందరినీ పోలీసులతో నిలువరించి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఇతర బయటి ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను రప్పించి, వారితో ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా..
» పులివెందుల మండలంలోని కనంపల్లి ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు గ్రామాన్ని నిర్బంధించారు. దీంతో గ్రామస్తులు ఓటు వేయడం కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ వారు ఏ మాత్రం కనికరించ లేదు. ‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి..’ అంటూ గ్రామస్తులు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.
ఇంతలోనే తమ ఓట్లను వేరే వారు వేశారని తెలుసుకున్న కనంపల్లె మహిళలు ఆందోళనకు దిగారు. మా ఓట్లు ఏమయ్యాయంటూ నిరసన తెలిపారు. వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. మోట్నూతనపల్లి గ్రామస్తులకు కూడా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారు.
» తుదకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మంగళవారం తెల్లవారుజామున హేమంత్ రెడ్డి నిద్ర లేచాక ఇంటి బయటికి వచ్చి చూస్తే వందలాది మంది టీడీపీ మూకలు చుట్టుముట్టాయి. బయటకు వస్తే మీ మీద దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులే హేమంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయలేకపోయారు. ఓ దశలో బయటకు రావడానికి ప్రయత్నించినా, బయట ఉన్న టీడీపీ మూక అరుపులు, కేకలతో భయపెట్టారు.
» ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని, రీపోలింగ్ నిర్వహించాలంటూ అచి్చవెళ్లి గ్రామస్తులు ఎన్నికల అధికారికి వినతి పత్రం సమరి్పంచారు. బయట ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ గూండాలు గ్రామాల్లో కర్రలతో, రాడ్లతో కలియ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.
మహిళలపైనా దౌర్జన్యకాండే
» ఎక్కడికక్కడ పురుషులను పోలీసులు నిర్బంధించగా.. ఏజెంట్లుగా కూర్చోడానికి మహిళలు ముందుకొచ్చారు. ఇందుకు అభినందించాల్సిన ఖాకీలు.. అధికార ఒత్తిళ్లకు తలొగ్గారు. ‘మగాళ్లతోనే కాలేదు.. మీరెందుకొచ్చారు.. గొడవలవుతాయి.. త్వరగా ఇంటికి వెళ్లిపోండి’ అంటూ వెనక్కు పంపడం విస్తుగొలుపుతోంది.
» పోలింగ్ బూత్‌లలోకి రాకుండా మహిళా ఏజెంట్లను అడ్డుకున్నారు. టీడీపీ రౌడీలు దూషణల పర్వం కొనసాగించినా చూస్తుండిపోయారు. అవసరమున్నప్పుడు బందోబస్తు ఇవ్వకుండా.. రిగ్గింగ్ అయిపోయాక వస్తారా.. అంటూ మరోచోట మహిళలు పోలీసులను నిలదీశారు. ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగా భవానీలు ఏజెంట్లుగా కూర్చోడానికి టీడీపీ నేతలను తప్పించుకుని వెళ్లగలిగారు. అయితే వారిని పోలీసులే అడ్డుకున్నారు.
» నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య.. నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచి్చనా అనుమతించలేదు. నోరు మూసుకొని పోండి’ అంటూ రౌడీ మూక గదమాయించింది. ఈ పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్న వారిపై సుమారు 350 మంది రౌడీలు దౌర్జన్యానికి దిగి వెనక్కు పంపారు.
» తమను టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చొన్న మహిళలను బెదిరించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎదుట అచ్చివెళ్లి గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ బూత్‌ల వద్దకు వెళితే మహిళలని కూడా చూడకుండా చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రిగ్గింగ్ చేసుకున్నారు
ఎర్రిపల్లె గ్రామంలో 600 ఓట్లు ఉన్నాయి. 350 మందికి పైగా టీడీపీ గూండాలు వచ్చి అరాచకం సృష్టించి, ఓట్లు వేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. పోలీస్ పహారా మధ్య టీడీపీ మూకలే మా ఓట్లన్నీ వేసేసుకున్నాయి. – అన్నారెడ్డి మమత, ఎర్రిపల్లె, పులివెందుల మండలం
ఏజెంట్లనూ వెళ్లనివ్వలేదు
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అల్లరి మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. కనీసం ఏజెంట్లను కూడా పోలింగ్ బూ త్‌ల వద్దకు రానివ్వలేదు. బయటి వ్యక్తులు వచ్చి గ్రామంలో తిష్ట వేశారు. మా గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అసలు ఇంత మంది పోలీసులను ఎందుకు దింపినట్లు? – రమాదేవి, కనంపల్లె, పులివెందుల మండలం
చంపేస్తామని బెదిరించారు
సోమవారం రాత్రి నుంచే టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఓటు వేయడం కోసం వస్తే చంపుతామని బెదిరించారు. మీరు స్లిప్పులు ఇచ్చి వెళ్లిపోండన్నారు. టీడీపీకి చెందిన బీటెక్ రవి, శ్రీనాథ్‌లతోపాటు 400 మంది బయట వ్యక్తులు వచ్చారు. పోలీసులు కూడా వారికి సహకరించారు. ఓటు..గీటు అంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – కుమారి, కనంపల్లె, పులివెందుల మండలం
స్లిప్పులు లాక్కుని చించేశారు
నా అనుభవంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. టీడీపీ గూండాలు సోమవారం రాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఇంటి ముందు రాడ్లు, కత్తులు పట్టుకొని తిష్ట వేశారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారు. జమ్మలమడుగు, కమలాపురం, వేంపల్లె ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీలు గ్రామాన్ని చుట్టి ముట్టారు. ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఓటు వేయడం కోసం ఎలాగో ఒకలా వచ్చిన వారి వద్ద నుంచి స్లిప్పులు లాక్కొని చింపేశారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగింది. – బాంధవి, ఎంపీటీసీ సభ్యురాలు, అచ్చవెళ్లి, పులివెందుల మండలం
ఏజెంట్ ఫారాన్ని చింపేశారు
గ్రామస్తులు ఎవరూ ఓటు వేయనందున రీ పోలింగ్ జరిపించాలి. నేను ఏజెంటుగా పోలింగ్ బూత్ వద్దకు ఆరు గంటల్లోపు వెళ్లాను. అప్పటికే టీడీపీ గూండాలు బూత్‌ల వద్దకు చేరుకొని నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని చించేశారు. ఇంటికి వెళ్లకపోతే చంపుతాం అని బెదిరించారు. ‘మీరు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు.. ఓట్లు మేమే వేసుకుంటాం.. వెళ్లిపోండి’ అని బెదిరించారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని.. లేదంటే దెబ్బలు తింటారని పోలీసులే చెప్పడం దారుణం. – అనురాధ, అచ్చివెళ్లి, పులివెందుల మండలం