
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అధికార కూటమి సర్కార్ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ఏవైనా కూటమి నేతలకు ప్రలోభాలకు, బెదిరింపులకు దిగుతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోలీసుల సాయంతో లా అండ్ ఆర్డర్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇక, తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి.. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది.
వివరాల ప్రకారం.. పులివెందుల మండలం అచ్చవెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, రేషన్ డీలర్ జనార్దన్ రెడ్డిపై రెవెన్యూ అధికారులు అక్రమ కేసు పెట్టారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేందుకు అధికారుల ద్వారా జనార్దన్ రెడ్డి రేషన్ షాపును తనిఖీ చేయించారు. అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రెండు కేజీలు బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదు చేశారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడి మేరకే రేషన్ షాపును తనిఖీ చేశామని అధికారులు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు, రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, మణీంద్రం, వేపకంపల్లి, విడవలూరు–1 ఎంపీటీసీ స్థానాలకు 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు.