
తనకు ఈ నెల నుంచి పెన్షన్ రాదంటూ ఇచ్చిన నోటీసులను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చూపుతున్న పులివెందులకు చెందిన రాజు కొల్లాయమ్మ
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా
పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్
కార్యకర్తలు, ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్న వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. సోమవారం మధ్యాహ్నం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, సమస్యలను ప్రజలు వివరించారు. ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ‘నేనున్నాను...’ అంటూ భరోసా ఇవ్వడంతోపాటు ధైర్యాన్ని నింపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి వెన్నుదన్నుగా ఉంటానని మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ... ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగనమండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ కీడు చేయకూడదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని ఆయన గుర్తుచేశారు.
కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం
టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కమలాపురం ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.