
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ
టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్ జగన్
ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి.. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్
దీనిపై న్యాయ పోరాటం చేస్తాం
చంబల్ లోయ బందిపోట్లను మరిపించే రీతిలో దొంగ ఓట్లు వేసుకున్నారు
ఏజెంట్లే లేకుండా ఎన్నికలు నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి
పోలీసులే దగ్గరుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహించారు
జిల్లా కలెక్టర్ సైతం దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు
ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి దాదాపు 7 వేల మంది టీడీపీ శ్రేణుల తిష్ట
ఒక్కో ఓటరుకు ఒక్కో రౌడీ చొప్పున ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేదనడానికి ఈ రెండు ఉప ఎన్నికలే నిదర్శనం
బాబు మోసాలు, దోపిడీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే ఓట్లు వేయరని ఈ దుర్మార్గాలు.. కలెక్షన్ ఏజెంట్లుగా మారిన పోలీసు అధికారులు
మద్యం బెల్టు షాపులు మొదలు మైన్స్, ఇసుక, పేకాట క్లబ్బుల వరకు వసూళ్లు
ఎమ్మెల్యేలు, చినబాబు, పెదబాబు వరకు అందరికీ వాటాలు
అందుకే ఈ ఎన్నికలకు ఏరికోరి పోలీసు అధికారుల నియామకం
విచక్షణాధికారాలు ఉన్నా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఎస్‌ఈసీ విఫలం
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ?
– వైఎస్ జగన్
అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.
చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.
పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు.
సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్‌స్టర్.. ఫ్రాడ్‌స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు.
మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు.
వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
ఉప ఎన్నిక పోలింగ్‌లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.
పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు
⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి.
⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్‌మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.
⇒ ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి.
మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు.
చంద్రబాబుకు ఇదే నా సవాల్
⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్‌స్టర్ లేదా ఫ్రాడ్‌స్టర్ అంటారు.
⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్‌లు మార్చేశారు.
⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.
⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.
ఏకంగా గ్రామాలే పంచుకున్నారు
ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు.
పోలింగ్ బూత్‌లకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?
⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ నిజం కాదా?
⇒ పులివెందుల టౌన్‌లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.
⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?
⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా?
⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?
⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?
⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?
⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?
⇒ పులివెందులలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?
⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?
⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?
⇒ ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు?
⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?
⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్‌లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి జరగలేదా?
⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?
భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి
మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.
డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు.
పోలీసులు పూర్తి వివక్ష
⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు.
⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు.
యథేచ్ఛగా దోపిడీ, వాటాలు
చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.
చంద్రబాబు మాట వినకపోతే..
ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్‌ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు.
మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.
ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?
2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.
ఇవిగో ఆధారాలు..
⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్‌కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్‌బూత్‌లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్‌మీట్‌లో చూపారు). పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.
⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.
⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.
⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.
⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే.
⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు.