
టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన వాహనం.. టీడీపీ గూండాల దాడిలో గాయపడిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై హత్యాయత్నం
వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై రాడ్లతో దాడి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ
సర్కారు పెద్దల దిగజారుడుతనం
నల్లగొండువారిపల్లె గ్రామంలో వీరిద్దరినీతుద ముట్టించేందుకు పథక రచన
ప్రజాస్వామ్యయుతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు
ఓటింగ్ క్యాప్చర్‌తో గెలవాలని కుతంత్రం
ఆటవిక పాలనకు అద్దం పడుతున్న దాడి
వాడు కూడా టార్గెట్.. వేయండి.. అంటూ సైకోల్లా అరుపులు, కేకలు
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు భుజంపై, రాముకు తలపై తీవ్ర గాయాలు
సమ్మెటలతో రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాల ధ్వంసం
రామలింగారెడ్డిని ఓ ఇంట్లోకి పంపి అడ్డుగా నిలిచిన గ్రామ మహిళలు
ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు టీడీపీ మూక విఫలయత్నం
గ్రామస్తులు తిరగబడటంతో వెనుదిరిగిన టీడీపీ సైకోలు
బందిపోటు దొంగల ముఠా తరహాలో బాబు ముఠా మెరుపు దాడులు
గుంపులుగా వాహనాల్లో రాక.. పోలీసుల కనుసన్నల్లోనే అరాచకం
పూర్వం రాజుల కాలంలో బందిపోట్లుండేవారు.. ఉన్నట్లుండి మెరుపు దాడులు చేస్తూ దోచుకెళ్లేవారు.. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు దొంగల ముఠా అంతకు మించి అన్నట్లు బరితెగించి వ్యవహరిస్తోంది.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ ముఠా అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేయడమే లక్ష్యంగా మెరుపు దాడులకు ఉపక్రమించింది.. గుంపులు గుంపులుగా వాహనాల్లో రావడం.. ఆయుధాలు చేత పట్టుకుని విచక్షణా రహితంగా దాడులు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది.. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతుండటం దుర్మార్గం.. ఎలాగైనా సరే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి.. ఓటింగ్ క్యాప్చర్ చేసి గెలవాలనే కుతంత్రంతో ఇలా చేస్తోంది.. ఈ అరాచకం చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆటవిక పాలనకు అచ్చుగుద్దినట్లు అద్దం పడుతోంది.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే డిపాజిట్ కూడా దక్కదనే భయంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు, కుతంత్రాలకు తెగబడింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా వైఎస్సార్‌సీపీ నేతలపై వరుస దాడులకు పాల్పడుతూ వసు్తన్న ఈ సైకో గ్యాంగ్.. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము)లపై బుధవారం పులివెందుల రూరల్ మండలం నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం చేసింది.
ఇనుప సమ్మెటలు, రాడ్లు చేత పట్టుకుని టీడీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడికి దిగాయి. వాడే.. టార్గెట్.. వేయండి.. అంటూ సైకోల్లా అరుపులు, కేకలతో అరగంటపాటు రెచ్చిపోయాయి. ఈ దాడిలో రామలింగారెడ్డి తలకు బలమైన గాయం కాగా, ఎమ్మెల్సీ భుజం ఎముక విరిగింది. ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న వైఎస్సార్‌సీపీ నేతలకు ఆ గ్రామ మహిళలు అండగా నిలిచి, ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో టీడీపీ మూకలు అక్కడి నుంచి తోకముడిచాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి.. వేల్పుల రామలింగారెడ్డికి సమీప బంధువు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి వేల్పుల రామలింగారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత పక్కనే ఉన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డితో మాట్లాడేందుకు వెళ్తుండగా, ఒక్కమారుగా టీడీపీ రౌడీ మూకలు వారిని చుట్టుముట్టాయి. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు.
దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. దాంతో ఆయన భుజం ఎముకలు విరిగిపోయాయి. ఆపై ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాలను సమ్మెటలతో ధ్వంసం చేయగా..అలజడి రేగడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మహిళలు.. కింద పడిపోయిన రామలింగారెడ్డికి అడ్డుగా నిలిచారు.
ఆయనపై మళ్లీ దాడి చేయబోతుండగా టీడీపీ మూకలను అడ్డుకున్నారు. కొంత మంది మహిళలు ఆయనను లాక్కెళ్లి పక్కనే ఉన్న ఇంట్లో వేసి తాళం వేశారు. దీంతో టీడీపీ రౌడీలు.. తాళం వేసిన ఇంటి లోపలికి పెట్రోల్ చల్లారు. నిప్పు పెట్టేందుకు విఫలయత్నం చేశారు. గొడవ జరుగుతోందనే విషయం గ్రామం మొత్తానికి తెలియడంతో గ్రామస్తులంతా అక్కడికి వచ్చారు. గ్రామస్తులు తిరగబడటంంతో టీడీపీ రౌడీ మూకలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
తుద ముట్టించేందుకు పక్కా ప్రణాళిక
వేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్ బెరైటీస్ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ దోపిడీపై.. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి సహకారంతో వేముల పార్థసారథిరెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి దొంగిలించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఫెన్ బెరైటీస్‌లో అక్రమ మైనింగ్‌కు అడ్డుగా నిలవగంతో ఆయన టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కనంపల్లె, మోట్నూతల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. పక్కా ప్రణాళికతో ఆయన్ను తుద ముట్టించాలని టీడీపీ శ్రేణులు కుట్ర పన్నాయి. బుధవారం ఆయన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి నల్లగొండువారిపల్లెకు వెళ్లారని తెలుసుకుని.. ఇనుçప సమ్మెటలు, రాడ్లు.. పెట్రోల్ బాటిళ్లు తదితర మారణాయుధాలతో అక్కడికి వెళ్లి మాటు వేశారు.
ఇవన్నీ పరిశీలిస్తే వేల్పుల రామలింగారెడ్డిని అంతం చేయాలని పక్కా ప్రణాళికతోనే టీడీపీ మూకలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తలపై రాడ్డుతో కొట్టగానే రామలింగారెడ్డి కింద పడిపోగా, ఆ వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై వారు దాడికి దిగారు. ఆ సమయంలో గుంపులో నుంచి ‘వీడితో పాటు వాడిని కూడా వదలొద్దు’ అంటూ కేకలు విన్పించడంతో మళ్లీ రామలింగారెడ్డి వైపు తిరిగారు. అప్పటికే మహిళలు అడ్డుగా నిలవడంతో రెండోసారి దాడి చేయడం సాధ్యపడలేదని తెలుస్తోంది. గ్రామంలో కాకుండా మార్గం మద్యలో దాడి జరిగి ఉంటే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ హత్యకు గురై ఉండే వారని గ్రామస్తులు చెబుతున్నారు.
హైకోర్టు ఆదేశించినా భద్రత కరువు
టీడీపీ నేతలతో ప్రాణహాని ఉందని, టిఫెన్ బెరైటీస్ కంపెనీకి కేర్ టేకర్‌గా ఉన్న తనకు పలువురితో ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని వేల్పుల రామలింగారెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఏడాదిగా ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని ఆదేశించింది. గన్‌మెన్ల జీతాలు సొంతంగా చెల్లించేందుకు ఆయన అంగీకరించడంతో ఆ దిశగా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడి నెల అవుతున్నా, వాటిని పోలీసులు అమలు పరచలేదు. అంటే ఆయన్ను తుద ముట్టించే కుట్రలో వారు కూడా భాగస్వాములు కావడం దుర్మార్గం. ఈ దాడిలో ఆయన ఆ గ్రామ మహిళల అండతో వెంట్రుక వాసిలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఏ ఒక్కరిపై బుధవారం రాత్రి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వరుస ఘటనలు.. యథేచ్ఛగా నిందితులు
మంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్‌లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్‌రెడ్డి పై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాషా (కిరికిరి బాషా) ముఠా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. బుధవారం వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లపై హత్యాయత్నం ఘటనలో కూడా అదే ముఠాతో పాటు వేముల పార్థసారథిరెడ్డి సోదరుడు పేర్ల శేషారెడ్డి సమీప బంధువులు పాల్గొన్నారు. ఈ ఘటనలోనూ పోలీసులు వెంటనే స్పందించక పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతమైన పులివెందులలో ఉద్రిక్తతలకు బ్రేక్ వేయాల్సిన పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నందునే వరుస ఘటనలు తెరపైకి వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్రలు, రాళ్లతో దాడి చేశారు..
మా గ్రామంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి, చెన్నారెడ్డిల ఇళ్ల వద్దకు వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు మాట్లాడేందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీడీపీ అల్లరి మూకలు 15 వాహనాల్లో మా ఊరికి వచ్చారు. వచ్చీ రాగానే నాలుగు వాహనాలను ధ్వంసం చేసి.. రామలింగారెడ్డి, రమేష్ యాదవ్‌లను గాయపరిచారు. కర్రలు, రాడ్లతో కొట్టారు.
– సునీల్ కుమార్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె
ఎదురుపడి ఉంటే చంపేసేవారు
మా గ్రామం రోడ్డుపై వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు ఎదురుపడి ఉంటే టీడీపీ మూకలు వారిని చంపేసేవి. వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అడ్డుపడకపోతే వారిని హతమార్చేవారు.
– వెంకట్రామిరెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె
ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు
జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగకూడదనే టీడీపీ వారు ఇలా దాడులకు పాల్పడ్డారు. ఇంటిపై పెట్రోలు పోసి.. నిప్పంటించబోయారంటే ఎంతగా తెగించారో ఇట్టే తెలుస్తోంది. 40 ఏళ్లుగా ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు.
– వై.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె
పోలీసుల తీరుపై శాంతియుత ర్యాలీ
వైఎస్సార్‌సీపీ నాయకులపై వరుసగా హత్యాయత్నాలు జరుగుతున్నా పోలీసు అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం, నిందితుల్ని అరెస్టు చేయకుండా యథేచ్ఛగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్కారం కల్పించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కడపలో బుధవారం శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ మంత్రి అంజాద్‌బాషా, కమలాపురం ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మందితో 3 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. అనంతరం అర్బన్ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ మురళీనాయక్‌కు వినతిపత్రం అందించారు.
బాబు డైరెక్షన్.. బీటెక్ రవి యాక్షన్
⇒ పులివెందుల నియోజకవర్గంలో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్‌లో ఎమ్మెల్సీ బీటెక్ రవి యాక్షన్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నేతలు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి తదితరులపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ వర్గీయులైన అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరిబాషా బృందంపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన బీటెక్ రవి.. సురేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య తేడాలు వచ్చాయని, అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని.. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనపై దాడి చేసి, నింద తమపై మోపారని చెప్పుకొచ్చారు. బుధవారం నాటి ఘటనతో టీడీపీకి సంబంధం లేనిదని తప్పించుకోజూశారు.
⇒ మరోవైపు రామలింగారెడ్డి వేముల మండలానికి చెందిన ఎస్సీ కార్యకర్తలను కులం పేరుతో దూషించడంతోనే ఘర్షణ చోటుచేసుకుందని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఏం జరుగుతోందో స్థానికులందరికీ స్పష్టంగా తెలిసినా, బీటెక్ రవి ఇలా బరితెగించి మాట్లాడటంపై విస్తుపోతున్నారు.
⇒ టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి కుట్రలు, ఎత్తుగడలకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తోడయ్యారు. వరుసగా వైఎస్సార్‌సీసీ నాయకులపై దాడి చేయడం ఈ కుట్రలో భాగం. బహుళ ప్రయోజనాలు ఆశించి ఇలా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత మంది వైఎస్సార్‌సీపీ నేతల్ని టార్గెట్ చేసి దాడి చేయనున్నట్లు సమాచారం. ఇలా వరుస దాడులతో పులివెందుల మండల ఓటర్లలో భయాందోళన సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తద్వారా జెడ్పీటీసీ ఉప ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించేలా చేయడం, లేదా ఒకవేళ ఓటింగ్ జరిగినా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాకుండా చూడటమే లక్ష్యమని తెలుస్తోంది.
ఓటమి తప్పదనే భయోత్పాతం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
సాక్షి, అమరావతి: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్థమై, కూటమి నేతలు ఇలా భయోత్సాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిను బుధవారం ఆయన ఫోన్‌లో పరామర్శించారు. వారితోపాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో మంగళవారం గాయపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డితో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని తిప్పికొడదామని పార్టీ నేతలకు జగన్ సూచించారు. టీడీపీ కూటమి నేతలు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని.. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.