
- నెల్లూరులో రూ.5,500 కోట్ల నాల్కో– మిధానీ యూనిట్ ప్యాకప్
- వైఎస్సార్‌సీపీ హయాంలో 60,000 టన్నుల అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం
- 110 ఎకరాలు కేటాయించి చిక్కులను పరిష్కరించిన గత ప్రభుత్వం
- పర్యావరణ అనుమతులతో సహా అన్ని పనులు నాడే పూర్తి
- ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్ పెట్టడం లేదని ప్రకటించిన నాల్కో
- చంద్రబాబు దెబ్బకి పారిపోతున్న కేంద్ర పీఎస్‌యూలు
- గతంలో టీడీపీ హయాంలోనే చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ–బీహెచ్‌ఈఎల్ యూనిట్ రాష్ట్రం నుంచి తిరుగుముఖం
- ప్రైవేట్ మోజులో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్న కూటమి సర్కారు
సాక్షి, అమరావతి: అటు కేంద్రంలోనూ అధికారంలో కొనసాగుతూ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి.. రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెళ్లగొట్టేలా వ్యవహరిస్తుండటంపై పారిశ్రామిక వర్గాల్లో విభ్రాంతి వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూతపడుతున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్‌యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది.
కీలకమైన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో, మిధానీ కలసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ స్థాపించేలా వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. పలు కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది.
2024–25 వార్షిక నివేదికలో ఈ విషయం నాల్కో స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే మంగళం పలకబోతున్నారని, రా్ష్ట్రం నుంచి ఒక భారీ ప్రాజెక్టును తరిమేస్తున్నారని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కూటమి నేతలు దీనిపై నోరు విప్పక పోవడం పట్ల ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు చేజారిపోతున్నా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ సంస్థలపైనే మోజు..
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలపై ఉన్న మోజు ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండదని పలు సందర్భాల్లో రుజువైంది. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నా నోరు తెరవడం లేదు. పైగా ఈ యూనిట్ మూసివేతకు సహకరించే విధంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో అనకాపల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయిస్తూ దానికి సొంత ఇనుప గనులు కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా కేంద్రాన్ని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడి చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 600 ఎకరాల్లో ఎనీ్టపీసీ, బీహెచ్‌ఈఎల్‌తో రూ.6,000 కోట్లతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను తీసుకురాగా విభజన అనంతరం టీడీపీ హయాంలో ఆ ప్రాజెక్టు అటకెక్కింది.
శరవేగంగా అన్ని అనుమతులు..
నెల్లూరులో హైఎండ్ అల్యూమినియం కంపెనీ ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేసింది. నాల్కో, మిధానీ కలసి 2019 ఆగస్టులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ (యూఏడీఎన్‌ఎల్) పేరిట భాగస్వామ్య కంపెనీనీ ఏర్పాటు చేశాయి. 2020 అక్టోబర్‌లో నెల్లూరు జిల్లా బీవీపాలెం వద్ద 110 ఎకరాలు భూమిని కేటాయించిన గత ప్రభుత్వం భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను సైతం వేగంగా పరిష్కరించింది. దీంతో 2021 జూలైలో ఉత్కర్ష కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అత్యవసరమైన పర్యావరణ అనుమతులు సైతం 2021 జూలైలో వచ్చేశాయి. నాల్కో సీఎండీ శ్రీధర్‌పాత్ర, మిధానీ ఎండీ సంజయ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలసి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు.