 
													ఇంటర్మిడియట్‌లో ‘ఎలక్టివ్’ విధానం నామమాత్రమే..
ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకున్న సైన్స్ విద్యార్థులు 42 మంది
2,592 మంది ఆరో సబ్జెక్టుగా మ్యాథ్స్, బయాలజీ ఎంపిక
రెండో భాష బదులుగా సబ్జెక్టులు ఎంచుకున్న 253 మంది
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మిడియెట్ విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలపై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులకు అదనంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్టుల ఎంపికలో ‘ఎలక్టివ్’ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, రెండో భాష స్థానంలో నచ్చిన సబ్జెక్టును తీసుకునే అవకాశాన్నీ అమలు చేశారు. అయితే, కొత్త విధానంపై అవగాహన కల్పించడంలో వెనుకబడడం, విద్యా సంవత్సరం ముందు నుంచే మార్పులు, చేర్పులు చేయకపోవడంతో ఎలక్టివ్ విధానం విద్యార్థులను ఆకర్షించలేకపోయింది.
దీంతో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే అదనపు సబ్జెక్టును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 42 మంది సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకోవడం గమనార్హం. ముఖ్యంగా జేఈఈ, నీట్ పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం కల్పించగా ఈ రెండు గ్రూపుల్లోనూ కేవలం 2,592 మంది మాత్రమే ఆరో సబ్జెక్టును తీసుకున్నారు. ఇక రెండో భాష (సెకండ్ లాంగ్వేజ్) స్థానంలో ఏదైనా గ్రూప్ సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వగా అతి కొద్ది మందే సబ్జెక్టును ఎంచుకున్నారు.
రెండో భాష స్థానంలో సబ్జెక్టు ఎంచుకున్న 253 మంది
గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ అంచెల వారీగా సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్ చదువుకుని పరీక్షలు రాశారు. వీరికి అనుకూలంగా 2025–26 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్మిడియెట్‌లో సీబీఎస్‌ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో సబ్జెక్టుల ఎంపిక, లాంగ్వేజెస్ స్థానంలో కొత్త సబ్జెక్టు ఎంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరంలో 5,28,805 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 253 మంది మాత్రమే రెండో భాష స్థానంలో సైన్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకొన్నారు. ఇందులో 117 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, మరో 136 మంది బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్‌ను ఎంచుకున్నారు. 
⇒ ఆరో సబ్జెక్టు ఎంపికలోనూ విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. ఎంపీసీ చదువుతున్న 1,059 మంది విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా బయాలజీని ఎంచుకోగా, బైపీసీ చదువుతూ మ్యాథమెటిక్స్ తీసుకున్న వారు 1533 మంది ఉన్నారు. Ü ఎంపీసీ గ్రూప్ చదువుతూ ఆరో సబ్జెక్టుగా చరిత్రను ముగ్గురు, సివిక్స్‌ను ఇద్దరు, కామర్స్ మరో ఇద్దరు ఎంపిక చేసుకున్నారు.
⇒ బైపీసీలో చేరిన కొందరు విద్యార్థులు ఆర్ట్స్ గ్రూపులనూ ఎంచుకున్నారు. 29 మంది విద్యార్థులు జియోగ్రఫీని, ఇద్దరు సివిక్స్, మరో ఇద్దరు చరిత్రను ఎంపిక చేసుకున్నారు. 
⇒ సీఈసీ గ్రూపులో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే మ్యాథమెటిక్స్ ఎంపిక చేసుకొన్నారు.   

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
