 
													సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ అత్తా,మామలు చిన్న కోడలిని చిత్ర హింసలకు గురి చేయడం కలకలం రేపింది. అందుకు తన తల్లిదండ్రులకు బాధితురాలి భర్త రంజింత్ కుమార్ వంతపాడటం గమనార్హం.
జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ చిన్న కోడలిపై అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కోరికను వ్యక్తం చేశారు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తల్లిదండ్రులు డిమాండ్‌కు భర్త మౌనంగా ఉండిపోవడంతో బాధితురాలికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చినప్పటికీ, తాము చెప్పినట్లు చేయలేదన్న కారణంతో గత పది రోజులుగా ఆమెను, ఆమె కుమారుణ్ని గదిలో బంధించారు. గదికి కరెంటు, మంచినీళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందడంతో, వారు పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. బాధితురాలిని బంధించిన గదికి తాళాలు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
