
సాక్షి, తిరుమల: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు.. ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయబాంత్రులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ కడప అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలు కూడా పండటం లేదు. సూపర్ సిక్స్ దొంగ హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రజలు ఆశపడి ఓట్లు వేశారు. 2029లో మళ్లి వైఎస్ జగన్ గెలవాలని కోరుకుంటున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు.. ప్రజలను, వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి లేకుండా, దొంగకేసులు పెట్టి భయబ్రాంతులకు చేస్తున్నారు.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగు వేల ఓట్లకుపైగా నల్లపురెడ్డి పల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లెకు సంబంధించి ఓట్లను తారుమారు చేస్తున్నారు. ఓ ఊరిలో 700 ఓట్లు ఉంటే నాలుగు.. ఐదు కిలోమీటర్ల దూరంలో బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లి ఓటు వేసే విధంగా చర్యలు తీసుకొన్నారు. ఓటింగ్ శాతం తక్కువ కావడానికి దారుణాలకు కూటమి ప్రభుత్వం ఒడిగడుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. వైఎస్ జగన్ గతంలో అనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్లు కాదు. నామినేషన్ కూడా వేసి ఉండరు. కానీ, నేడు కూటమి పాలన అరాచక పాలన చేస్తుంది. కూటమి అరాచక పాలనపై కోర్టును ఆశ్రయిస్తాం. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఈ పద్దతి మార్చుకుంటే మంచిది. లేకుంటే చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు.