
మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలాయపల్లిలో గ్రామంలో వల్లెపు ఆశ అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ఓ దండగుడు పరారైన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉగాది పండుగ సందర్భంగా మేకలబాలాయపల్లె గ్రామంలోని బంధువుల ఇంటికి సింహాద్రిపురం మండల పరిధిలోని గురిజాల గ్రామానికి చెందిన వల్లెపు ఆశ అనే మహిళ వచ్చింది. ఈ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా పెద్దమ్మతల్లి, దుర్గమ్మతల్లికి గ్రామ ప్రజలు బోనాలు మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. బుధవారం వల్లెపు ఆశ పిల్లలకు ఐస్ కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌లో వచ్చి వల్లెపు ఆశ మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ప్రొద్దుటూరు వైపు పరారయ్యాడు. వెంటనే బాధితురాలు కలమల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. కొండాపురం సీఐ మహమ్మద్‌రఫీ మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.
విద్యార్థిని అదృశ్యం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సాంఘిక సంక్షేమ గిరిజన స్కూల్‌లో విద్యార్థిని అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న యశోద ఉదయం 7 గంటలకు హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైందన్నారు. విద్యార్థినికి మతిస్థిమితం సరిగా లేదని స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశమన్నారు.