
చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
పోరుమామిళ్ల : కలసపాడు మండలం గంగాయపల్లెలో ఈనెల 7న నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ముట్టే నరేంద్ర( 20) అలియాస్ జగన్‌ను ఆదివారం మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నరేంద్ర జులాయిగా తిరిగేవాడన్నారు. మద్యానికి బానిసయ్యాడని, తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టేవాడన్నారు. సెల్‌ఫోన్‌లో అసభ్య వీడియోల ప్రభావంతో పథకం ప్రకారం చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పెడతామన్నారు. సమావేశంలో కలసపాడు, పోరుమామిళ్ల ఎస్‌ఐలు తిమోతి, కొండారెడ్డి పాల్గొన్నారు.