
ఎలుగుబంటి దాడి
పోరుమామిళ్ల : మండలంలోని ఎరసాలకు చెందిన బాయకట్టు నాగరాజు ఆదివారం ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఊరికి సమీపంలోని కొండలో గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. కొండపొలంలో గొర్రెలు మేస్తుండగా పిల్లలున్న ఎలుగుబంటి నాగరాజుపై దాడి చేసింది. హఠాత్తుగా వచ్చిన ఎలుగుబంటిని చూసిన నాగరాజు పెద్దగా కేకలు వేస్తూ తనను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో దగ్గరలో ఉన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో ఎలుగుబంటి పిల్లలతో పారిపోయింది. ముఖానికి, చేతులకు బాగా గాయాలవడంతో నాగరాజును పోరుమామిళ్లలో ప్రథమ చికిత్స అనంతరం కడపకు తరలించారు.
షూటింగ్ ప్రారంభం
కాశినాయన : మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన ముత్తుముల లోకేష్ హీరోగా ‘విద్యాదీపం’ అనే సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. శనివారం రాత్రి ఉప్పలూరులోని శ్రీఅభయాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో షూటింగ్ చేశారు. హీరో లోకేష్, హీరోయిన్ సావిత్రికృష్ణలపై ఎంఈఓ నిర్మల క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి పిల్లి రమణారెడ్డి, సంఘ సేవకుడు బీఎస్ నారాయణరెడ్డితోపాటు 40 మంది సినిమా యూనిట్ సభ్యులు, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
గోడపై నుంచి పడి
మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఇంటి గోడపై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రెడ్డెమ్మ ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వగా, ఆ వైరు కిందకు వేలాడుతుండటంతో, ఇంటిగోడ పైకి ఎక్కి సరిచేసే క్రమంలో అదుపుతప్పి కిందకు పడి తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రైలు కింద పడి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్ మధ్యలో ఆర్.రాచపల్లి రైల్వేగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వృద్ధుడు(60) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు.

ఎలుగుబంటి దాడి