
జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు
కడప అర్బన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 1400 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా విధులను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో మీడియాకు వివరాలను తెలియజేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించనున్నామన్నారు.
ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో ఉప ఎన్నికకు 650 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారన్నారు. ఇప్పటివరకు పులివెందులలో 500 మందిపై, ఒంటిమిట్టలో 650 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడిందన్నారు. స్థానికేతరులు ఆయా ప్రాంతాలలో వుండకూడదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా వుంచుతామన్నారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
1400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విధులు
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ వెల్లడి