
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలో మండలంలోని బసవాపురం టోల్‌గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని డేరంగుల పవన్ కుమార్ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఎర్రగుంట్లకు చెందిన పవన్ కుమార్, నాగరాజు నాయక్ అనే వారు శనివారం రాత్రి మోటార్ బైక్‌పై బద్వేలు వైపు నుంచి వస్తుండగా టోల్ గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్‌ను 108 వాహనంలో మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో నాగరాజు నాయక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతి చెందిన పవన్ కుమార్ అవివాహితుడని తెలుస్తోంది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్టు మైదుకూరు అర్బన్ పోలీసులు ఆదివారం తెలిపారు.
అప్పుల బాధ తట్టుకోలేక..
కడప కోటిరెడ్డిసర్కిల్ : కమలాపురం మండలం సి.రాజుపాలెం గ్రామానికి చెందిన కామనూరు నాగరాజు (35) అప్పుల బాధ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నాగరాజు భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. మద్యానికి అలవాటుపడిన నాగరాజు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తనకు ఆరోగ్యం సరిగా లేదని పందిళ్లపల్లెలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకుని వస్తానని తన తల్లికి చెప్పి కమలాపురం–ఎర్రగుడిపాడు మధ్యన దిగువ రైలు పట్టాలపై రైలు కింద పడి మృతి చెందాడు. 0701 నెంబరుగల రైలు లోకో పైలట్ ె వెంకటేశ్వర్లు గమనించి ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దేవపట్ల సర్పంచ్ ఆవుల
వేణుగోపాల్‌రెడ్డి కన్నుమూత
సంబేపల్లె : వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్‌రెడ్డి (73) మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త వినగానే ఆవుల కుటుంబ సభ్యులతో పాటు రాయచోటి నియోజకవర్గం, సంబేపల్లె మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిత్యం ప్రజలలోనే : ఆవుల వేణుగోపాల్‌రెడ్డి నిత్యం ప్రజల మనిషిగానే మెలిగేవారు. ఎవరు ఏ సహాయం కావాలని అడిగినా స్పందించే నాయకుడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలానే పేద విద్యార్థుల విద్యకు అండగా నిలిచేవారు. దేవపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన చిన్న వయస్సులోనే సినీ నిర్మాణంపై ఆసక్తి చూపుతూ దేవపట్ల – సంబేపల్లె ప్రాంతాలలో పలు చిత్రాల చిత్రీకరణకు సహకరించారు. వేణుగోపాల్‌రెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, రెండవ కుమారుడు ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి డీసీఎంస్ చైర్మన్‌గా పని చేశారు. అలాగే ఆమె కోడలు నాగశ్రీలక్ష్మి ప్రస్తుతం సంబేపల్లె ఎంపీపీగా ఉన్నారు. మూడో కుమారుడు మల్లికార్జునరెడ్డి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. కాగా మండల పరిధిలోని దేవపట్ల పంచాయతీ ఆవులవాండ్లపల్లెలో 12 వ తేదీ మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కూలిన వంతెన స్థానంలో అప్రోచ్ రోడ్డు
సిద్దవటం : కడప–బద్వేలు మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలో కిటికీల వంతెన కూలిపోయిన నేపథ్యంలో ఆదివారం అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఏఈ రామాంజనేయులు మాట్లాడుతూ రహదారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుకు గ్రావెల్ వేయించి డోజర్‌తో చదును చేయించామన్నారు. దీంతో లారీలు, బస్సులు యాథావిధిగా రాకపోకలు సాగిస్తాయన్నారు. అప్రోచ్ రోడ్డు రహదారిపై సిమెంటు పైపులు వేసి రహదారిని ఎత్తు లేపుతామన్నారు. లేదంటే వర్షాలకు గ్రావెల్ కొట్టుకు పోతుందన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి