
కూలిన మట్టి మిద్దె
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని తిరువెంగళాపురం పంచాయతీలోని తిరువెంగళాపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మట్టి మిద్దె కూలిపోయింది. తిరువెంగళాపురం ఎస్సీ కాలనీకి చెందిన నాగిపోగు బాలకృష్ణ కొన్నేళ్లుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిలోని ఓ గది పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు వేరే గదిలో నిద్రిస్తుండటంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం
కడప అర్బన్ : కడప నగరం బిల్డప్ సర్కిల్ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ కింద పడి దొరబోయిన సుదర్శన్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై కడప ట్రాఫిక్ సీఐ జావీద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నూరు మండలం కొక్కిరాయపల్లె గ్రామానికి చెందిన దొరబోయిన సుదర్శన్ (21) ఐటీఐ చదువుకుంటున్నాడు. అతని అన్న కడప కార్పొరేషన్‌కు సంబంధించి చెత్త సేకరించేందుకు తమ ట్రాక్టరు బాడుగకు ఇచ్చాడు.
ఆదివారం కావడంతో సుదర్శన్ కూడా ట్రాక్టరుతోపాటు వచ్చాడు. విజయదుర్గాదేవి ఆలయం నుంచి బిల్టప్ మార్గమధ్యంలోకి రాగానే బర్రె అడ్డు రావడంతో ట్రాక్టరు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టరులో ఉన్న సుదర్శన్ జారి అదే ట్రాక్టరు క్రింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
చిన్నమండెం : పవిత్ర పుణ్య క్షేత్రం గండి నుంచి మదనపల్లెకు వెళ్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మదనపల్లెకు చెందిన ప్రయాణిలు గండి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లె వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు

కూలిన మట్టి మిద్దె