
సాక్షి, అమరావతి: పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. వైఎస్సార్‌సీపీ నేతలపై నమోదైన కేసుల్లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తొందరపాటు చర్యలు వద్దంటూ సోమవారం కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.
పులివెందుల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఈ నెల 6వ తేదీన వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసు పెట్టారు.
పోలీసుల దాష్టీకంపై వైఎస్సార్‌సీపీ నేతల హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు వద్దని, ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పులివెందులలో అధికార పార్టీ టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దాడులకు పాల్పడిన వాళ్లను వదిలేసి గాయపడ్డ వాళ్లపైనే కేసులు కడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.