
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికార టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను వైఎస్సార్‌సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎండగట్టారు. టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్పులను సేకరిస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. ఈసీ తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ..
.. పోలింగ్ బూత్‌లను మార్చడంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు. తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి.
.. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు. ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు.
.. మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు. మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాం. అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్‌లను అందించాలి. ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి.
నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు. ిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు. నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు. దీనిపై మొద్దు నిద్ర వీడి.. ఎన్నికల కమిషన్ స్పందించాలి అని డిమాండ్ చేశారాయన. ఇదిలా ఉంటే.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం నుంచి జరగనుంది.
