
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసులు దాష్టీకానికి దిగారు. కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ వేకువ జామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి మరీ తమ వాహనంలో ఎక్కించి తరలించారు. ఆయన్ని కడప పీఎస్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
అరెస్ట్ సమయంలో పోలీసులతో వైఎస్ అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు వినలేదు. సిట్టింగ్ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు అవినాష్ రెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో ఇంటి బయటే ఆయన బైఠాయించగా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లనూ లాగి పడేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి ఆవరణలో బీభత్సం సృష్టించారు.




ఆపై చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా అవినాష్ రెడ్డిని బలవంతంగా వాహనంలో ఎక్కించారు. అరెస్ట్ సమయంలో అక్కడే ఉన్న మీడియాతో ఆయన మాట్లాడారు.. ‘‘ఎన్నికలు జరిపే విధానం ఇదేనా?. కేవలం వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టార్గెట్ చేసి టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారు. మా కార్యకర్తలను వదలడం లేదు. పోలీసులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. దాడులు ఆపాల్సిన పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. ఇంతదారుణమైన పరిస్థితి మునుపెన్నడూ చూడలేదు’’ అని అన్నారాయన.

ఇదిలా ఉంటే.. టీడీపీ దాడులను ఖండిస్తూ గాయపడ్డ తమ నేతలకు సంఘీభావంగా ఈ నెల 5వ తేదీన వైఎస్సార్‌సీపీ ర్యాలీ నిర్వహించింది. ఇందుకుగానూ అవినాష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టారు. అయితే ఈ కేసుల్లో ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని, ఎవరీని అరెస్ట్ చేయొద్దని ఏపీ హైకోర్టు సోమవారం పులివెందుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా పోలింగ్ టైంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని వేంపల్లిలో హౌజ్ అరెస్ట్ చేశారు.