సాక్షి, తాడేపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడంపైనా విచారం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో ఎవరైనా గాయపడి ఉంటే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఒక ప్రకటనలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
టాటానగర్(జార్ఖండ్)-ఎర్నాకుళం(కేరళ) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగి.. మరో బోగికి అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికుల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్(70) అనే వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. లోకో పైలట్ సమయస్ఫూర్తితో మిగతా ప్రయాణికులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.


