తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,660 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరకని భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు.


రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలు
డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేట్టారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు.
శ్రీ గోవిందరాజవారి ఆలయంలో…
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా వేకువజామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 నుండి 3 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జరుగనున్నాయి. ఉదయం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.
శ్రీనివాసమంగాపురంలో …
డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
అదేవిధంగా డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
అప్పలాయగుంటలో ….
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.
డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.
నారాయణవనంలో …
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.
డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 నుండి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


