
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజలు ముక్కున వేలేసుకునేలా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటూ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు.. పోలింగ్ వేళ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులపై దాడులు చేయడం మొదలు.. ప్రచారాలను అడ్డుకోవడం.. దాడులు చేయడం, పోలింగ్ బూత్‌లను మార్పించడం, పోలీసుల సాయంతో అక్రమ కేసులు.. నిర్బంధాలు, చివరకు ఇవాళ పోలింగ్ వేళ ఓటర్లను భయపెట్టడం.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం టీడీపీకి షరా మామూలే అనే విషయాన్ని స్పష్టం చేశాయి.
పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ వేళ టీడీపీ అరాచకాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ నేతలు, కొన్నిచోట్ల ఓటర్లను అడ్డుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లను వెనక్కి పంపేసి మరీ ఓట్లు వేసుకుంటున్నారు. టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తున్నా.. ఎన్నికల అధికారులు, పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్న చందాన ఉండిపోయారు. ఈ అరాచకాలను కప్పి పుచ్చేందుకు ఎల్లో మీడియా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.
పులివెందుల, ఒంటిమిట్టలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఈ ఉదయం నుంచి కథనాలతో ఊదరగొడుతోంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌ల వద్దకు కేవలం కూటమి పార్టీల అనుకూల మీడియాలను(ఆఖరికి చిన్నాచితకా యూట్యూబ్ ఛానెల్స్‌ను సైతం) పోలీసులు అనుమతిసున్నారు. అలాగే.. ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతోందంటూ కవరేజ్‌తోనూ భలే కవరింగ్ చేస్తున్నారు.
ఓ పది మంది టీడీపీ అనుకూల వ్యక్తులను క్యూ లైన్‌లో నిలబెట్టి వీడియోలు తీసి బయటకు వదులుతున్నారు. తద్వారా.. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతులో, ఎంతో సక్రమంగా జరుగుతోందంటూ ఎల్లో మీడియా ద్వారానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంటెంట్‌నే అటు టీడీపీ అండ్ కో సోషల్ మీడియాలోనూ ప్రమోట్ చేసుకుంటోంది.
మరోవైపు.. పోలీసుల సాయంతోనే టీడీపీ పలుచోట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. తమకు కావాల్సిన ఓట్లన్నీ టీడీపీ గుద్దించుకున్నాక.. ఆపై ఊళ్లలోకి వచ్చి ఓటేయడానికి రావాలంటూ అభ్యర్థులను, కొందరు ఓటర్లను పోలీసులు బతిమాలుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహిస్తున్న ఓటర్ల నుంచి పోలీసులు చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఇంకోపక్క.. పులివెందుల, ఒంటిమిట్టలోని పలు గ్రామాలకు చెక్ పోస్టులు వెలిశాయి. వాటి గుండా ఓటర్లతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎంట్రీ ఇవ్వడం లేదు పోలీసులు. కేవలం టీడీపీ నేతల కార్లు కనిపిస్తే చాలూ రైట్ రైట్ చెబుతున్నారు.