
ఎర్ర చందనం కేసులో అరెస్టయిన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి
ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు
రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్‌తో చెట్టాపట్టాలు
కడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.
రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్ సర్కిల్‌లో బెనర్జీ అనే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు.
ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.