
పట్టుబడ్డ వారిలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నాగ దస్తగిరిరెడ్డి
52 ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు స్వాధీనం
కడప అర్బన్: వైఎస్సార్ కడప, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి 52 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం జిల్లాలోని చాపాడు మండలం ప్రొద్దుటూరు–అన్నవరం మధ్య చిన్నవరదాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు.
ఆ సమయంలో ఎర్ర చందనం దుంగల్ని రవాణా చేస్తున్న వాహనాలు అటుగా వచ్చాయి. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా.. ఆరుగురిని పట్టుకున్నారు. నిందితులు అడవిలో ఎరచ్రందనం చెట్లను నరికి, దుంగలుగా మార్చి వాటిని ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ కార్లలో రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బంది గమనించి అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వెనుక బడా స్మగ్లర్లు ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్
అరెస్ట్ అయిన వారిలో చాపాడుకు చెందిన ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందిన కాయలి శ్రీనివాసులు, చక్రాయపేట మండలానికి చెందిన బండ్రెడ్డి ఓబులరెడ్డి, పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగిరెడ్డి ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరిలో ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డి మోస్ట్ వాంటెడ్ ఎర్ర చందనం స్మగ్లర్. కడప జిల్లాలో ఇతనిపై 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఇతడి భార్య లాలూబీపైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయి జైలులో ఉందని ఎస్పీ చెప్పారు.
ఇతని కుటుంబ సభ్యులైన లాలుబాషా, పక్రుద్దీన్, జాకీర్ కూడా పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు. నాగదస్తగిరిరెడ్డి తన అనుచరులైన ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి, ఉమ్మనబోయిన క్రిష్ణయ్య, కాయలి శ్రీనివాసులు, ఓబులరెడ్డి, శనివారపు బాలగంగిరెడ్డితో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఢిల్లీలో ఉండే సలీం అనే ప్రధాన స్మగ్లర్, ఇతర స్మగ్లర్లు ఢిల్లీలో ఉండే ఒక హవాలా వ్యాపారి ద్వారా హైదరాబాద్‌లో ఉండే విక్రంసింగ్ సోలంకి డబ్బులను హవాలా రూపంలో నాగదస్తగిరిరెడ్డికి అందజేస్తున్నాడన్నారు.
విక్రంసింగ్ సోలంకిని కూడా వారం క్రితం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఉమ్మనబోయిన క్రిష్ణయ్యపై కర్నూలు జిల్లాలో 2 ఎర్రచందనం కేసులు, 3 చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన ఆర్‌ఎస్‌టిఎఫ్ సీఐ సి.శంకర్‌రెడ్డి, ఆర్‌ఎస్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది, మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్‌ఐ చిన్న పెద్దయ్యను ఎస్పీ అభినందించారు.
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
» ఎర్ర చందనం కేసులో అరెస్టయిన రామమోహన్
» ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు
» రాష్ట్ర మంత్రి లోకేశ్, ప్రవీణ్‌తో చెట్టాపట్టాలు
కడప అర్బన్: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్‌రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్‌రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు. రామమోహన్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు.
ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్‌ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాం«దీబజార్ సర్కిల్‌లో బెనర్జీ అనే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్‌రెడ్డి నిందితుడు.
ఉక్కు ప్రవీణ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్‌ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.