పెద్దల సభలో.. 'కుప్పం ఎమ్మెల్యే'! | Ysrcp Protest at podium demanding action against opposition member | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో.. 'కుప్పం ఎమ్మెల్యే'!

Sep 26 2025 5:37 AM | Updated on Sep 26 2025 5:37 AM

Ysrcp Protest at podium demanding action against opposition member

సూపర్‌ సిక్స్‌ హామీలపై చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడ 

మండలిలో అధికార పక్ష ఎమ్మెల్సీలతో మంత్రుల రభస 

విపక్ష సభ్యుడిపై చర్య తీసుకోవాలంటూ పోడియం వద్ద ఆందోళన

సూపర్‌ సిక్స్‌పై చర్చ సందర్భంగా.. కుప్పం ఎమ్మెల్యే అని ప్రస్తావించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌

అధికార పక్షం తీవ్ర అభ్యంతరం 

వైఎస్‌ జగన్‌ను పులివెందుల ఎమ్మెల్యే అంటూ టీడీపీ వాళ్లు సంబోధించలేదా? అని నిలదీసిన విపక్ష నేత బొత్స 

మేనిఫెస్టో రిలీజ్‌ చేసింది ఆనాటి కుప్పం ఎమ్మెల్యేనే.. అది వాస్తవం కాదా?  

గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటూ అధికార పక్షానికి సూచన 

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా 143 ఎన్నికల హామీల ఎగవేతపై చంద్రబాబు సర్కారు వంచన, మోసాలను విపక్ష వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీలు పెద్దల సభ సాక్షిగా ఎండగట్టడంతో అధికార పక్షం చర్చను అడ్డుకుంది. కూటమి సర్కారు అసమర్థత, మోసాలను విపక్షం గట్టిగా నిలదీయడంతో చర్చను పక్కదారి పట్టించింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పలు సందర్భాల్లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అంటూ సంబోధిస్తున్న నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ గురువారం శాసనమండలిలో సూపర్‌ సిక్స్‌పై చర్చ  జరిగిన సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. 

దీన్ని రికార్డుల నుంచి తొలగించాలని, ఆ వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు యత్నించారు. సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని పేర్కొనటాన్ని అధ్యక్షస్థానంలో ఉన్న మీరు ఖండించాలంటూ ప్యానల్‌ చైర్మన్‌ ఇషాక్‌ను మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. సభ జరగకుండా అడ్డుకోవడం సరికాదని ప్యానల్‌ చైర్మన్‌ పదేపదే సూచించినా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.  

మీరు అలా అంటే..  మేమిలానే అంటాంబొత్య సత్యనారాయణ 
టీడీపీ ఎమ్మెల్సీలు సభ జరగకుండా అడ్డుకోవడం, మంత్రుల అభ్యంతరాలపై మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్య సత్యనారాయణ దీటుగా స్పందించారు. ‘సభ్యుడు చెప్పింది అవాస్తవమైతే.. అప్పుడు మీరు రూలింగ్‌ ఇవ్వండి. రికార్డులు పరిశీలించండి. ఆ తరువాత ముందుకు వెళ్దాం’ అని సభాపతిని కోరారు. అనంతరం బొత్స తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్‌ చేసినప్పుడు..’ అని తమ సభ్యుడు సంబోధించారని గుర్తు చేశారు. 

‘మాజీ  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ వాళ్లు పలుమార్లు సంబోధించలేదా? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం మా నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తారో.. అప్పటి దాకా మేం కూడా కుప్పం ఎమ్మెల్యే అనే సంబోధిస్తాం.. ఇందులో రెండో ఆలోచన లేదు’ అని తేల్చి చెప్పారు. ‘సూపర్‌ సిక్స్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటించారు. ఇది వాస్తవం..! అని స్పష్టం చేశారు. 

టీడీపీ తెచ్చిన సంప్రదాయమే: మాధవరావు
సభలో సభ్యులెవరైనా సరే ముఖ్యమంత్రిని.. ముఖ్యమంత్రి అనే సంబోధించాలి. మాజీ ముఖ్యమంత్రిని కూడా మాజీ ముఖ్యమంత్రి అనే సంబోధించాలి. టీడీపీ వారు ఏక వచనంతో మాట్లాడుతూ తెచ్చిన సంప్రదాయానికి అందరూ అలవాటు పడిపోతున్నారు’ అని ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యానించారు. ‘సీఎంని కుప్పం ఎమ్మెల్యే అని అనడం సరికాదు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి. 

ఒకరిని ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడడం సంప్రదాయం కాదు. సభను గౌరవంగా నడపాలి’ అని బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి  మాట్లాడుతూ.. తాము జగన్‌మోహన్‌రెడ్డిని.. మాఫియా డాన్‌ అనో.. పులివెందుల పులికేశి అని అంటే మీరు ఒప్పుకుంటారా?’ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.  

నిరుద్యోగ భృతి, ఆడ్డబిడ్డ నిధి ఎక్కడ? 
‘సూపర్‌ సిక్స్‌’పై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ 
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌లు సూపర్‌ సిక్స్‌లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలు ప్రధానమైనవని ఊరూరా ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండానే ‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ అని సభ నిర్వహించి సంబరాలు ఎలా చేసుకుంటారని శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ నిలదీసింది. 

గురువారం శాసన మండలిలో ‘సూపర్‌ సిక్స్‌’పై వైఎస్సార్‌సీపీ సభ్యుడు రమేష్‌ యాదవ్‌ చర్చను ప్రారంభించి మాట్లాడారు. ‘ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ హిట్‌ లేదు. మీరిచి్చన హామీల్లో 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతికి రూ.7,200 కోట్ల బడ్జెట్‌ కావాలి. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో పెట్టలేదు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్‌కు రూ.13 వేల కోట్లు కావాలి. ఈ హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజలందరూ టీడీపీ నాయకులు ఎప్పుడొస్తారా.. అడుగుదామని ఎదురు చూస్తున్నారు’ అని మండిపడ్డారు. 

మేనిఫెస్టోనే మార్చేశారు  
ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో.. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక ఇంకో మేనిఫెస్టో అన్నది ఒక్క చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మాత్రమే కనిపిస్తోందని రమేష్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచి్చన హామీలన్నీ అమలు చేసి చూపించింది వైఎస్‌ జగన్‌ మాత్రమేనని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై  చర్చకు కూటమి సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

సభా నాయకుడైనా.. మాజీలైనా కించపరచడం మంచిది కాదు
చైర్మన్‌ రూలింగ్‌ 
ఈ అంశంలో రికార్డులు పరిశీలించి నిర్ణయం వెలువరించిన తర్వాతే సభ కొనసాగించాలని టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు పట్టుబట్టడంతో మండలి చైర్మన్‌ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం చైర్మన్‌ మోషేన్‌రాజు దీనిపై  ప్రకటన చేస్తూ ‘ఈ రోజు సభలో గందరగోళం మధ్య జరిగిన ఘటనలు అన్నీ సంప్రదాయాలకు విరుద్ధం. ఇరుపక్షాల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సభ్యుడు అన్న మాటల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మంత్రి మాట్లాడిన కొన్ని మాటలూ అభ్యంతరకరంగా ఉన్నాయి. 

మరోసారి వాటిని  పరిశీలించాక రికార్డుల నుంచి తొలగిస్తాం. సభా సంప్రదాయాలు ఎవరూ ఉల్లంఘించడం మంచిది కాదు. సభా నాయకుడిని, గతంలో వివిధ పదవుల్లో సేవలు చేసిన వారు ఓడిపోయారనో లేదంటే రాజకీయాల్లో లేరనో, రిటైరయ్యారనో ఎవరినీ కించపరచడం మంచిది కాదు. అందరం ఈ రోజుతో మరిచిపోయి పార్టీలకు అతీతంగా వ్యవస్థలను, వ్యక్తులను, ఆయా హోదాల్లో ఉన్న వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది..’ అని రూలింగ్‌ ఇచ్చారు. కొత్త సభ్యులకు సభా నియమావళిపై అవగాహన కోసం ఈ సమావేశాల అనంతరం నిర్వహించే కార్యక్ర మంలో అందరూ పాల్గొనాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement