
పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న వైఎస్సార్ కడప జిల్లా వాసి
మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలింపు
బాధితుడితో పాటు మరికొందరి స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం
తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులపాలు
సాక్షి, టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్‌టౌన్ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం..
అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్ అండ్ ఆర్‌లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్‌రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్‌మెంట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు.