
హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుల చేతిలో హతమైన ఫైనాన్షియర్
బాకీ దారుల ఆస్తుల అటాచ్ కోసం కోర్టులో కేసు వేసిన వేణుగోపాల్‌రెడ్డి
ఆ కోపంతోనే హత్య చేయించిన బాకీ దారులు
ప్రొద్దుటూరు క్రైం(కడప జిల్లా): వడ్డీ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి(Venugopal Reddy) కిరాయి హంతకుల చేతిలో హతమయ్యాడు. వేణుగోపాల్‌రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుల ద్వారా అతన్ని చంపించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్‌లలో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చాపాడు వద్దనున్న కుందు వంతెన వద్ద గుర్తించారు.
అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంతో కలిసి రూరల్ పోలీసులు అతికష్టం మీద వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికి తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి బంధువు, మరో వ్యక్తి కలసి వేణుగోపాల్‌రెడ్డిని హతమార్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన నలుగురు కిరాయి హంతకులను శుక్రవారం ప్రొద్దుటూరుకు పిలిపించారు. వారు తమ కారును వేణుగోపాల్‌రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు. అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్‌రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలో ఉన్న ఆర్చీ దాటగానే కారులో ఉన్న కిరాయి హంతకులు అతన్ని ఆపినట్లు తెలిసింది.
ఎవరు మీరు అని అడిగే లోపే వారు వేణుగోపాల్‌రెడ్డిని కొట్టడంతో కింద పడిపోయాడని, ఈ క్రమంలోనే దుండగులు కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని బతిమాలుకున్నా దుండగులు కనికరించలేదని తెలిసింది. వేణుగోపాల్‌రెడ్డి స్కూటీలో అక్కడికి రావడం, వారు హత్య చేయడం ఇదంతా రెండు, మూడు నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ వ్యాపారి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న దుండగులు మృతదేహాన్ని అదే కారులో వేసుకొని దువ్వూరు దారిలోని కామనూరు బ్రిడ్జి వద్ద కుందు నదిలో పడేసి అదే రాత్రికి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. తర్వాత నిందితులు హైదరాబాద్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కుందు నదిలో ఉన్న వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు.
నిందితుల్లో వేణుగోపాల్‌రెడ్డి భార్య తరపు బంధువు కూడా..
వేణుగోపాల్‌రెడ్డిని హతమార్చిన వారిలో అతని భార్య సమీప బంధువు ఒకరు ఉన్నట్లు తెలిసింది. కాగా 2016లో నిందితుల్లోని ఒక వ్యక్తితో గొడవ జరిగింది. వేణుగోపాల్‌రెడ్డి డబ్బు అడగటానికి వెళ్లగా అతను దాడి చేశాడు. దీంతో వేణుగోపాల్‌రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండేళ్ల క్రితం వీరి మధ్య రాజీ కుదిరింది. కాగా నిందితుల్లోని ఇద్దరు వ్యక్తులకు వేణుగోపాల్‌రెడ్డి రూ. లక్షల్లో బాకీ ఇచ్చాడు. ఈ డబ్బు గడువు ముగిసినా వారు ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. అంతేగాక కొంత కాలం తర్వాత వారి ఆస్తులు అటాచ్ కోరుతూ ఫైనాన్షియర్ మరో మారు కోర్టును ఆశ్రయించాడు. ఇది ఇరువురు బాకీ దారులకు ఆగ్రహాన్ని కలిగించింది.
ఈ విషయమై పలువురు వేణుగోపాల్‌రెడ్డికి నచ్చచెప్పినట్లు తెలిసింది. అయినా కూడా అతను ఆస్తుల అటాచ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ కారణంతోనే ఇద్దరు కలిసి హైదరాబాద్‌కు చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్‌రెడ్డిని హతమార్చినట్లు సమాచారం. కాగా కేసులోని ప్రధాన నిందితులు, కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.