
అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు
పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్‌ను కలిసిన సందర్భంగా ‘గట్టిగా ఎవడూ..’ అడగలేదంటూ చిరంజీవినుద్దేశించి వ్యాఖ్య
మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా బాలకృష్ణ పరుష వ్యాఖ్యలు.. వెంటనే బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చిరంజీవి
అమెరికా నుంచి ప్రకటన విడుదల
జగన్ తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారన్న మెగాస్టార్
నాడు తాము చర్చించిన మీదటే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య
సినిమా టికెట్‌రేట్లు పెంచారన్న చిరంజీవి
శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ‘ఎవడు..?’ అంటూ తూలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. కాగా అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను విదేశాల్లో ఉన్న చిరంజీవి తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి పరిశ్రమ సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. నాడు.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఆ సమావేశమే కారణమైందని స్పష్టం చేశారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వాడు.. వీడు.. సైకో..! అంటూ బాలకృష్ణ దుర్భాషలాడటాన్ని బట్టి ఆయన మానసిక స్థాయిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సాక్షి, అమరావతి: ‘వాడెవడు....?’ఇదీ చిరంజీవిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్య! మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా తీవ్ర కలకలం సృష్టించాయి. బావ చంద్రబాబు మనసులో మాటనే బావమరిది బాలకృష్ణ వెల్లడించారన్నది స్పష్టమైంది. అందుకే సభలో అధికార కూటమి సభ్యులు ఎవరూ వ్యతిరేకించ లేదు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం చంద్రబాబు కూడా మౌనముద్ర దాల్చి బాలయ్య వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థించారు.
తద్వారా చిరంజీవి గురించి టీడీపీ అధికారిక విధానమే అదని శాసనసభ వేదికగా సంకేతాలిచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. చంద్రబాబు, బాలకృష్ణ గతంలో చిరంజీవిని అవమానించిన ఉదంతాలను అందరూ గుర్తు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని దూషించిన మాటలను ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ హయాంలో చిరంజీవిని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించి గౌరవించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వెరసి బాలకృష్ణ శాసససభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలయ్య తీరుపై చిరు అభిమానులు, కాపు సామాజికవర్గం రగిలిపోతోంది.
బాబు మనసులో మాట బాలయ్య నోట..
రాజకీయ వ్యూహంతోనే చిరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిని పదే పదే అవమానించడం టీడీపీ విధానమన్నది మరోసారి స్పష్టమైంది. 2024 ఎన్నికల ముందు గత్యంతరం లేక కుట్రపూరిత మౌనం వహించిన చంద్రబాబు, బాలకృష్ణ ప్రస్తుతం ఏరు దాటాక చిరంజీవిని బోడి మల్లన్నను చేశారు. అందుకే సందర్భం కాకపోయినా సరే బాలకృష్ణ శాసనసభ వేదికగా చిరంజీవిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి అనే కనీస గౌరవం కూడా లేకుండా ‘వాడెవడు..?’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనసభ సమావేశాల్లో ఇప్పటివరకు మాట్లాడని బాలకృష్ణ గురువారం హఠాత్తుగా లేచి చిరంజీవిని అవమానించడం వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. లేదంటే చర్చ సినిమా రంగం అభివృద్ధి అంశం వరకే పరిమితమై ఉండేది. సినిమా రంగంపై చర్చ కాదని, చిరంజీవిని మరోసారి అవమానించడమే తమ లక్ష్యమని బాలకృష్ణ ద్వారా టీడీపీ చాటి చెప్పింది.
అభ్యంతరం చెప్పని బాబు... వారించని డిప్యూటీ స్పీకర్
బాలయ్య వ్యాఖ్యలకు టీడీపీ కూటమి అధికారిక ముద్ర
ముందస్తు వ్యూహంతోనే చిరంజీవిని అవమానించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు యావత్ అధికార కూటమి తమ వ్యవహారశైలి ద్వారా స్పష్టం చేసింది. అందుకే బాలకృష్ణ వ్యాఖ్యలపై శాసనసభాపక్ష నేత హోదాలో చంద్రబాబు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆయన సభలోనే ఉన్నప్పటికీ అసలు ఆ విషయమే పట్టనట్లుగా వ్యవహరించారు. ఇక చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడుతుంటే యావత్ అధికార కూటమి సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. కొందరు టీడీపీ సభ్యులు ముసిముసిగా నవ్వుతూ కనిపించడం గమనార్హం.
తద్వారా ఆ వ్యాఖ్యలను అధికార కూటమి సభ్యులు బహిరంగంగానే సమర్థించారు. ఇక స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను అడ్డుకునేందుకు, వారించేందుకు కనీసం ప్రయత్నించ లేదు. ఆయన మైక్‌ను కట్ చేయనూ లేదు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సభలో లేనివారి గురించి మాట్లాడటం సరికాదని వారించలేదు. అంతేకాదు.. బాలకృష్ణ తన ప్రసంగం ముగించిన తరువాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ ‘వెరీ గుడ్ సర్..’ అని అభినందించడం గమనార్హం. అంటే చిరంజీవిని అవమానించడం టీడీపీ అధికారిక విధానమేనని శాసనసభ సాక్షిగా విస్పష్టంగా ప్రకటించారు.
మానసిక రోగిగా సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలయ్య
2004లో ఇద్దరిపై రివాల్వర్‌తో కాల్పులు
కేసు నుంచి తప్పించుకునేందుకే మెంటల్ సర్టిఫికెట్
తాజా పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ మానసిక రోగి అనే విషయం మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2004లో హైదరాబాద్‌లో తన సన్నిహితులైన నిర్మాత బెల్లంకొండ సురేశ్, సిద్ధాంతి సత్యనారాయణ చౌదరిలపై ఆయన రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. తన భార్య వసుంధర పేరుతో లైసెన్స్ ఉన్న రివాల్వర్‌తో తన నివాసంలోనే ఈ కాల్పులకు తెగబడ్డారు. అప్పట్లో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు బాలకృష్ణ అప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయన మానసికస్థితి సరిగా లేదని అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు సర్టిఫికెట్ జారీ చేశారు.
ఆయన ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అమెరికాలో స్థిరపడ్డ కాకర్ల సుబ్బారావును ఆహ్వానించి హైదరాబాద్‌లోని నిమ్స్ డైరెక్టర్‌గా నియమించింది ఎన్టీ రామారావే. ఆ అనుబంధంతోనే బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి తప్పించేందుకు మెంటల్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఆయన సహకరించారని పరిశీలకులు చెబుతున్నారు. తనకు ఇంతగా సహకరించిన కాకర్ల సుబ్బారావును సైతం తరువాత బాలకృష్ణ అవమానించారు. బసవతారకం ట్రస్ట్ నుంచి ఆయన్ను తొలగించారు. టీడీపీ అనుకూల చానల్ ఇంటర్వ్యూలో కాకర్ల సుబ్బారావు వెల్లడించిన అంశాల వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గతంలోనూ చిరంజీవికి ఎన్నోసార్లు అవమానం
జనసేన, కాపు సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు
అదే బాబు, బాలయ్య విధానం
చంద్రబాబు, బాలకృష్ణ గతంలో కూడా చాలాసార్లు చిరంజీవిని అవమానించారు. 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవిని అవమానించిన ఉదంతాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో చంద్రబాబు, బాలకృష్ణ మొదటి వరుస కుర్చీల్లో కూర్చుని ఉండగా.. చిరంజీవి ఓ మూలన నిలబడే కార్యక్రమాన్ని వీక్షించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వకుండా నిలబెట్టడం విభ్రాంతి కలిగించింది. ఇక గతంలో పలు బహిరంగ సభల్లో పీఆర్పీ, జనసేన పార్టీల కార్యకర్తలను, కాపు సామాజికవర్గాన్ని బాలకృష్ణ దూషిస్తూ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జనసేన పార్టీ కార్యకర్తలను ఓసారి ‘అలగా జనం..’ అని బాలకృష్ణ దూషించారు. మరోసారి ‘సంకర జాతి... కొడుకులు..’ అని కూడా పరుష పదజాలంతో దుర్భాషలాడిన వైనాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చిరంజీవి మాతృమూర్తి గురించి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ శాసనసభలో అవమానకరంగా మాట్లాడారు. ఇలా ప్రతిసారి... సందర్భం కాకపోయినా దాన్ని సృష్టించి మరీ చిరంజీవిని, ఆయన కుటుంబాన్ని అవమానించడం చంద్రబాబు, బాలకృష్ణతోపాటు యావత్ టీడీపీ అధికారిక రాజకీయ విధానంగా మారిందన్నది సుస్పష్టం.