సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నీచరాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను , దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ నేతలను వేధించడమే ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాదిన్నర కాలంలో అనేక నిదర్శనాలున్నాయి. వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడానికి తన ఎల్లో మీడియాను వాడుకుంటారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ముందుగా కొన్ని కథనాలను రాయిస్తారు. ఏదో జరిగిపోతుందనే భావన ప్రజలకు కలిగేలా చేస్తారు. ఆ తర్వాత ఏదో పెద్ద నేరం చేసేశారని నమ్మించడానికి దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐపీఎస్ అధికారులతో సిట్ వేసి విచారణ చేయిస్తారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా వారితో వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.
బెదిరించి వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.లేదంటే భౌతికంగా దాడి చేసి చెప్పిస్తారు. బలవంతంగా పేర్లు చెప్పించడం .. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వం పని. దేవుడిని సైతం తన స్వార్ధ రాజకీయాలకు వాడుకునే నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. చంద్రబాబు రాజకీయ కక్షలకు తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు.టిటిడిని అడ్డు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌పై బురదజల్లుతున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ అయ్యిందని చంద్రబాబు దుర్మార్గంగా ప్రచారం చేశారు. జగన్‌పై బురద చల్లడానికే చంద్రబాబు ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు.
పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేశారు.సీబీఐ విచారణ జరిపించాలని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ద్వారా విచారణ చేయించాలని చెప్పింది.దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవద్దని చంద్రబాబుకు చురకలు అంటించింది.
కోర్టుకు వెళ్లినందుకు వైవీ సుబ్బారెడ్డిపై కక్ష తీర్చుకునేందుకు వరుస కథనాలు రాయించారు. చిన్న అప్పన్న అనే వ్యక్తిని జూన్ 6వ తేదీన సిట్ విచారించింది. వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చెప్పాలని చిన్న అప్పన్నపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఏపీలో ఏదైనా పెద్ద ఇష్యూ జరగగానే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెస్తారు.నెయ్యిలో కల్తీ ఉందని ఇంత వరకూ నిరూపించలేకపోయారు.
లడ్డూ ప్రసాదాన్ని ఇప్పటి వరకూ ఎక్కడికీ టెస్టుకు పంపించనే లేదు.కానీ లడ్డూ కల్తీ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న అప్పన్న 2018 వరకూ వైవి.సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. అంతకంటే ముందు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వద్ద కూడా పనిచేశారు. చంద్రబాబు టార్గెట్ వైవీ సుబ్బారెడ్డి కాబట్టి వేరే నేతల పేర్లు బయటికి రావు. ఇప్పటి మంత్రి పార్థసారథి గతంలో టీటీడీ పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు.

వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీ నేత కాబట్టి ఆయన్ని టార్గెట్ చేశారు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి ఖరీదు 276 రూపాయలు మాత్రమే. ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ, జగన్‌పై బురదజల్లడమే చంద్రబాబు పని. మా పార్టీ నుంచి ప్రజలను దూరం చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ చేస్తున్నది చాలా నీచమైన రాజకీయం. దేవాలయాలను, దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు. ఎవరిపై కక్ష తీర్చుకుందాం..ఎవరిని లోపల వేద్దామనేదే చంద్రబాబు ఆలోచన .చంద్రబాబు,లోకేష్ వైఎస్సార్‌సీపీపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’అని హితువు పలికారు.


