సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు. ఆ ఆవేదనతోనే రైతు దొండపాటి రామారావు గుండెపోటుకు గురై చనిపోయారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయించడంపై డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్-8 రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా తనకు చెరువులో ప్లాట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన రైతు రామారావు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కలేదన్నారు. ఆ ఆవేదనలో ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రశ్నిస్తే... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీపై నిందలు వేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మద్దతుగా వారి తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం..
రాజధాని కోసం ప్రభుత్వానికి పొలం ఇస్తే.. అందుకు బదులుగా ఇంత ఎత్తు మునిగిపోయే చోట ప్లాట్ ఇచ్చారని రైతు రామారావు మీతో చెప్పుకున్నాడు. అయినా అతని ఆవేదన ప్రభుత్వానికి కనిపించడం లేదు. మా ఇల్లు అభివృద్ది కోసమని తీసుకుని ఎక్కడో ఫ్లాట్ ఇస్తే హైదరాబాద్ తరహాలో దొంగలు వచ్చి మా పీకలు కోసే పరిస్ధితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతుల్ని ఎలా దగా చేస్తోందో ఇదే నిదర్శనం. వారికి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తుంది వేరొకటి అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.
రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మా పై ప్రచారం చేస్తున్నారు. రైతుల నుంచి పట్టా భూములు తీసుకుని చెరువు భూముల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రైతులకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తే రేపు చట్టబద్దంగా చెల్లుతుందా ?, రైతు మీ మీద నమ్మకంతో తమ భూములిస్తే ప్లాట్లు చెరువుల్లో ఇస్తారా ? దొండపాటు, పిచ్చుకలపాలెంలో చెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ రైతులు మనోవేదనతో బాధలో ఉన్నారు.
తీవ్ర మనోవేదనలో అమరావతి రైతులు
28 వేల మంది రైతులు వాళ్ల పొలాలు ఇస్తే అందులో ఎకరం ఉన్న రైతులు 19,970 మంది ఉన్నారు. ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్లు 4,214 మంది, రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్లు 3,200 మంది, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 829 మంది ఉన్నారు. ఈ లెక్కన ఎకరం, రెండెకరాలు ఉన్న 23 -25 వేల మంది రైతులు మీ అభివృద్ధి మాటలు నమ్మి పొలాలు ఇస్తే వాళ్లకు 29 గ్రామాల్లో చెరువులు, వాగులు పూడ్చేసి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువుల్లో ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?, ఈ బాధలన్నీ వాళ్లకూ తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ చనిపోయిన రైతు దొండపాటి రామారావు మరణం.
రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం
చెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చిన మాట నిజం కాదా?, చెరువును పూడ్చిన చోట ప్లాట్ ఇస్తున్నామని రైతులకు చెప్పారా ?.అది మోసం కాదా ?. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చారా ?. ఇప్పటికైనా బ్యాంకు రుణాలకు పనికొచ్చే పట్టా భూములు ఇవ్వాలి, వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందుకు రావాలి. చెరువుల్లోనే ప్లాట్లు ఇస్తాం, ఉంటే ఉండండి, పోతే పోవాలని అంటే ఆ రైతుల తరపున వైఎస్సార్సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు ఇచ్చిన పొలాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు వారికి న్యాయం చేయాలని డైమండ్ బాబు డిమాండ్ చేశారు.


