రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
బయటకు తరలించేది ఇలా...
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా అందించే బియ్యంకు అధిక ధరలు ఆశ చూపి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి కొందరు చీకటి వ్యాపారాన్ని చేస్తున్నారు. పగలు సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో దర్జాగా వాహనాల్లో తరలిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చామంటూ నిర్భీతితో బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నారు. కళ్లముందే అన్ని జరుగుతున్నా వారిపై చర్యలు శూన్యం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థతోపాటు దుగ్గిరాల మండలంలో రేషన్ షాపు లు నిర్వహిస్తున్న నిర్వాహకులు తమ జేబులు నింపుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ బయో మెట్రి క్ వేయించుకుని రేషన్ ఇవ్వకుండా అరకొర నగదు ఇచ్చి లబ్దిదారులను మభ్యపెడుతు నెలకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలు వెనుకవేసుకుంటున్నట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో 136 రేషన్ షాపులు ఉండగా, సుమారు 70వేలకు పైగా రేషన్ కార్డు దారులు ఉన్నారు. వీరికి నెలకు సుమారు 10వేల టన్నులకు పీడీఎస్ బియ్యం రేషన్ బియ్యంగా ప్రభుత్వం సరఫరా చేస్తుంది.
ముందుగానే బయోమెట్రిక్...
60ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానపడ్డ వారికి ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నిబంధన కొంతమంది డీలర్లకు బాగా కలసి వచ్చింది. నేరుగా ఈ–పాస్ మిషన్‌ను లబ్ధిదా రుని ఇంటికి తీసుకువెళ్లి వేలిముద్ర తీసుకుని ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పి వచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ షాపు యజమానులు సివిల్ సప్లయీస్ నుంచి బియ్యం రాగానే ఎవరైతే బియ్యం తీసుకోరో వారిని గుర్తించి వారి ఇంటికి వెళ్లి వేలిముద్రలు వేయించుకుని ఒక కేజీ బియ్యానికి రూ 5 నుంచి రూ.10 చెల్లిస్తున్నారు. బియ్యంతోపాటు పంచదార అమ్ముకుంటున్నారు. మిల్లర్లకు కేజీ రూ.25 నుంచి రూ.35 వరకు అమ్ముతున్నారు.
రేషన్ డీలర్లు సేకరించిన బియ్యాన్ని హోటల్స్ కు పంపగా.. మిగిలిన బియ్యాన్ని మండలంలో ఓ వ్యక్తి సేకరించి నియోజకవర్గంలోని దుగ్గిరాల, మంగళగిరి రూరల్ పరిధిలోని పలు మిల్లులకు అర్ధరాత్రి ఆటోల ద్వారా తరలిస్తున్నారు. ఎక్కడా కూడా పోలీసులు కానీ, సివిల్ సప్లయ్ అధికారులు గానీ తనిఖీలు నిర్వహించకపోవడంతో రేషన్ మాఫియాకు హద్దు లేకుండా పోయింది. ఒక లారీ ట్రిప్ గమ్యస్థానానికి చేరితే రాత్రికిరాత్రే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. దీంతో కేసులు పెట్టినా పట్టించుకోకుండా ఈ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పంచదార నిల్వలను పెద్ద పెద్ద దుకాణాలకు పంపించి, లావుగా ఉన్న పంచదారలో ఈ పంచదారను కలిపి కల్తీ చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.


