బాబు ‘ప్రైవేట్‌’ జపం.. వైద్య విద్యార్థులకు శాపం | Chandrababu Coalition govt obstructs new medical colleges in AP | Sakshi
Sakshi News home page

బాబు ‘ప్రైవేట్‌’ జపం.. వైద్య విద్యార్థులకు శాపం

Nov 6 2025 5:08 AM | Updated on Nov 6 2025 5:14 AM

Chandrababu Coalition govt obstructs new medical colleges in AP

పులివెందుల బోధనాస్పత్రి నుంచి వైద్య పరికరాలను తరలిస్తున్న దృశ్యం

కొత్త మెడికల్‌ కాలేజీలకు అడ్డుపడ్డ కూటమి సర్కారు.. కన్వీనర్‌ కోటా సీట్లకు కోత

ఏపీలో గతేడాది 700.. ఈ ఏడాది 1,750 ఎంబీబీఎస్‌ సీట్లు పోయాయ్‌

రెండేళ్లలో 2,450 మెడికల్‌ సీట్లు కోల్పోయిన మన విద్యార్థులు 

సీట్లు పెరగకపోవడంతో మనకు తీవ్ర అన్యాయం.. వైద్య విద్య కలలు ఆవిరి 

ఏపీ, తెలంగాణ మధ్య మెడికల్‌ సీట్ల కటాఫ్‌లలో తీవ్ర వ్యత్యాసం 

తెలంగాణలో నీట్‌ ఓపెన్‌ కేటగిరీలో 406 మార్కులకే కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు

ఏపీలో 484 మార్కులు వచ్చినా ఓసీ విద్యార్థులకు దక్కని కన్వీనర్‌ సీటు  

బీసీ–ఏలో 341 మార్కులు వచ్చిన విద్యార్థికి తెలంగాణలో కన్వీనర్‌ సీటు 

అదే విభాగంలో వందకుపైగా మార్కులు అదనంగా తెచ్చుకున్నా 

ఏపీ విద్యార్థులకు నిరాశే.. దేశ చరిత్రలో మెడికల్‌ కాలేజీలు తమకొద్దని చెప్పి చరిత్రకెక్కింది చంద్రబాబు ఒక్కరేనని సర్వత్రా విమర్శలు 

మన విద్యార్థులకు మెడికల్‌ సీట్లు.. పేదలకు చేరువలో నాణ్యమైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యం లక్ష్యంగా ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం  

గుంటూరులో ఉంటున్న కోటేశ్వ­రరావు ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన కుమారుడు అశ్వర్థ్‌ నీట్‌ యూజీృ2025లో 484 మార్కులు సాధించాడు. ఈ ఏడాది పేపర్‌ సరళిని బట్టి మంచి స్కోర్‌ సాధించాడని, కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని అశ్వర్థ్‌ తల్లిదండ్రులు భావించారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఓపెన్‌ కేటగిరీలో 491 స్కోర్‌ వరకు కన్వీ­నర్‌ సీటు వచ్చింది. ఏడు మార్కు­ల తేడాతో అశ్వర్థ్‌ కన్వీనర్‌ కోటా సీటు కోల్పో­యాడు. గుంటూరుకే చెందిన అశ్వర్థ్‌ స్నేహితుడు ధీరజ్‌ నీట్‌లో 475 స్కోర్‌ చేయగా 16 మార్కుల తేడాతో కన్వీనర్‌ కో­టా సీటు చేజారింది. 

‘డాక్టర్‌ కావాలని మా అబ్బా­యి చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనేవాడు. అ­ప్పు­లు చేసి రూ.5 లక్షలు ఖర్చు పెట్టి విజయ­వాడ­లోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివించా. అక్కడే నీట్‌ కోచింగ్‌ తీసుకుని రేయింబవళ్లు కష్టపడి చది­వాడు. మంచి మార్కులొచ్చినా మావాడికి కన్వీనర్‌ కోటా సీటు రాలేదు. ఈ ప్రభుత్వం కనీసం ఒక్క వైద్య కళాశాలను ప్రారంభించినా మావాడికి కచ్చి­తం­గా కన్వీనర్‌ సీటులో వచ్చేది. ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రారంభించకపోవడంతో అన్యా­యం జరిగింది..’ అని అశ్వర్థ్‌ తండ్రి కోటేశ్వరరావు ఆవేదన చెందుతున్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మెడికల్‌ కాలేజీలను తమకొద్దని చెప్పి చంద్రబాబు చరిత్రకెక్కారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
సాక్షి, అమరావతి

వైద్య విద్య కలలు ఛిద్రం..
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం రాష్ట్రంలో అశ్వర్థ్, ధీరజ్‌ లాంటి వేల మంది విద్యార్థులకు టీడీపీ కూటమి సర్కారు ద్రోహం తల­పెడుతోంది. మన విద్యార్థుల వైద్య విద్య కలలను ఛిద్రం చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నాలుగు, ఈ దఫా ఏడు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రభు­త్వం మోకాలడ్డటంతో ఈ ఒక్క విద్యాసంవత్సరమే ఏకంగా 1,750 ఎంబీబీఎస్‌ సీట్లను మన విద్యార్థు­లు నష్టపోయారు. బాగా చదివి నీట్‌లో మంచి స్కోర్‌ చేసినప్పటికీ కూటమి సర్కారు నిర్వాకాలతో ఏపీ విద్యార్థులకు కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు దక్కలేదు. 

అదే తెలంగాణలో.. గతేడాది ఎని­మిది, ఈదఫా ఒకటి చొప్పున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో మెడికల్‌ సీట్లు మరిన్ని పెరిగాయి. తద్వారా తెలంగాణ వి­ద్యా­ర్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు మెరు­గు­పడ్డాయి. రెండో విడత కౌన్సెలింగ్‌ ముగిసే సమ­యానికి తెలంగాణలో ఓపెన్‌ కేటగిరిలో నీట్‌లో 406 మార్కులు స్కోర్‌ చేసిన విద్యార్థికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు లభించింది. కానీ ఏపీలో మాత్రం పోటీకి తగ్గట్టుగా మెడికల్‌ సీట్లు పెరగకపోవడంతో ఏయూ రీజియన్‌లో 491, ఎస్వీయూ పరిధిలో 479 మార్కుల వరకు మాత్రమే కన్వీనర్‌ సీటు దక్కింది. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కంటే 73–85 మార్కులు ఎక్కువగా వచ్చినప్పటికీ ఏపీ విద్యార్థు­లకు కన్వీనర్‌ కోటాలో మెడికల్‌ సీటు దక్కకపో­వడం గమనార్హం.


రిజర్వేషన్‌ విద్యార్థులకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు మరింతగా పెంచడంతోపాటు ప్రజలకు ఉచితంగా సూప­ర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువలో అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 2023–24­లోనే ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 మెడికల్‌ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూర్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశా­లలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం గతేడాది నాలు­గు మెడికల్‌ కాలేజీలు (పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని) ప్రారంభం కాకుండా అడ్డు­పడ్డారు. 

పులివెందుల వైద్యకళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ.. తమకు వద్దంటూ కూ­టమి సర్కారు లేఖ రాసింది. ఎట్టకేలకు పాడేరులో మెడికల్‌ కాలేజీ ప్రారంభమైనా.. 150 సీట్లు రావా­ల్సింది 50 మాత్రమే వచ్చాయి. ఇలా గత విద్యాసంవత్సరం 700 సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో మరో 7 వైద్య కళాశాలలు (పాలకొల్లు, నర్సీపట్నం, అమలా­పురం, పిడుగురాళ్ల, పెనుగొండ, పార్వతీపురం, బాపట్ల) ప్రారంభమై 1,050 ఎంబీబీఎస్‌ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరాల్సి ఉండగా ఒక్క వైద్యకళాశాలను కూడా చంద్రబాబు సర్కారు ప్రా­రంభించలేదు. 

ఇలా టీడీపీ కూటమి సర్కారు కక్ష­పూరిత విధానాలతో రెండేళ్లలో 2,450 మంది ఏపీ విద్యార్థులు వైద్యవిద్యకు దూరమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గుర­య్యారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రిజర్వేషన్‌ విభాగాల్లో కటాఫ్‌ వ్యత్యాసం 100 మార్కులు, ఆపై­న ఉండటమే దీనికి నిదర్శనం. రెండోదశ కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌లో తెలంగాణలో బీసీ–ఏ విభాగంలో 341 మార్కులు సాధించిన విద్యార్థులకు కన్వీ­నర్‌ కోటా సీటు దక్కడం గమనార్హం. అదే ఏపీలోని ఎస్వీయూ పరిధిలో తెలంగాణలో కంటే వందకుపైగా అదనంగా మార్కులు స్కోర్‌ చేసినా ఏపీ విద్యార్థులకు కన్వీనర్‌ కోటా సీటు దక్కని దుస్థితి నెలకొంది.  

కొత్తవి తేకపోగా.. ఉన్నవాటికి ఎసరు..
కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నత వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంపొందించాలని దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు సైతం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూటమి పార్టీలు కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. 

ఇంత అనుకూలమైన పరిస్థితులున్నప్పటికీ సద్వినియోగం చేసుకోకుండా మన విద్యార్థుల వైద్య విద్య కలలను చిదిమేస్తూ చంద్ర­బాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన వైద్య కళాశాలలను ప్రైవేట్‌ చేతుల్లో పెడుతుండటం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడు­తున్నారు. వైద్యులై ప్రజలకు సేవలు అందించాలనుకున్న పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

బాబు ప్రభుత్వం కొత్త కాలేజీలు తేకపోగా గత సర్కారు తెచ్చిన వాటిని సైతం ప్రైవేట్‌పరం చేయడమే­మిటని నిలదీస్తున్నారు. అదే ఈ ప్రభుత్వం అడ్డుపడకుంటే ఏపీకి అదనంగా 2,450 మెడికల్‌ సీట్లు సమకూరి తమ పిల్లలకు కచ్చితంగా ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చి ఉండేవని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.  

ఒక్క కాలేజీ ఏర్పాటైనా మా పాపకు సీటొచ్చేది..
మా అమ్మాయికి నీట్‌లో 480 మార్కులు వచ్చాయి. తాను ఏయూ రీజియన్‌లో లోకల్‌. అక్కడ 491 మార్కులకే కన్వీనర్‌ కోటా సీటు ఆగిపోయింది. 11 మార్కుల తేడాతో మా అమ్మాయికి కన్వీనర్‌ కోటా సీటు దూరమైంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో చేర్చి ఎంబీబీఎస్‌ చదివించే స్థోమత లేదు. ఈ ప్రభుత్వం ఒక్క మెడికల్‌ కాలేజీని ప్రారంభించినా మా అమ్మా­యికి కచ్చితంగా సీటు వచ్చి ఉండేది. కొత్త మెడికల్‌ కళాశాలలు ప్రారంభించకపోవడంతో మాలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోంది. 
– రోషిరెడ్డి, వైద్యవిద్య ఆశావహ విద్యార్థిని తండ్రి, వైఎస్సార్‌ కడప జిల్లా 

ఇప్పటికైనా విరమించుకోవాలి
రాష్ట్రం విడిపోయే నాటికి తె­లంగాణలో మనకంటే త­క్కు­వ మెడికల్‌ సీట్లున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 10 వేలకు చేరువలో ఎంబీబీ­ఎస్‌ సీట్లున్నాయి. ఏపీలో మాత్రం ఏడువేల సీట్లు కూడా లేవు. సీట్లు పెరగకపోవడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన కళాశాలలను ఈ ప్రభుత్వం పీపీపీలో ప్రైవేట్‌కు ఇస్తోంది. 

ప్రైవేట్‌కు వైద్యకళాశాలలు అప్పగిస్తే ప్రజలు, విద్యార్థులకు నష్టమే గానీ లాభం లేదు. అన్నివర్గాల నుంచి ప్రైవేటీకరణపై వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పీపీపీ నిర్ణ­యాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి విద్యార్థులకు మేలు చేయాలి.  
– డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement