
రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గ నేతలు
చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు.. మాట మాత్రంగా కూడా నిలువరించకుండా మౌనం
స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసినా మౌనం వీడని సోదరుడు పవన్
పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైనా ఎప్పుడూ పరామర్శించని చంద్రబాబు
ఇప్పుడు చంద్రబాబు రాగానే స్వయంగా ఎదురేగి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన పవన్
జ్వరం నెపంతో హైదరాబాద్‌కు వెళ్లినా చంద్రబాబునాయుడితో మాత్రం మంతనాలు
అన్న స్పందించినా తమ్ముడు నోరు విప్పకపోవడంపై కాపు సంఘాల నేతలు, చిరు అభిమానుల ఆగ్రహం
ఇది మరో రాజకీయ డ్రామానేనని రాజకీయ వర్గాల్లో చర్చ
చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారని విమర్శలు
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తమ రాజకీయ డ్రామాలో భాగంగానే ఆదివారం హైదరాబాద్‌లో ఇరువురూ కలుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో దానిని కవర్ చేసుకునేందుకు, రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు జోరుగా చర్చ నడుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల్లోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబుగానీ, జనసేన ఎమ్మెల్యేలుగానీ కనీసం స్పందించలేదు. పవన్‌కళ్యాణ్ అయితే.. చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటివరకూ నోరువిప్పకపోగా ఆదివారం తన ఇంటికొచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛంతో ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు, కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.
నిజానికి.. ఈ ఏడాది రెండు, మూడుసార్లు పవన్ అనారోగ్యానికి గురైనప్పటికీ అప్పుడెప్పుడూ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించని చంద్రబాబు ఈసారి హైదరాబాద్‌కు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించడాన్ని చూస్తుంటే ఇదంతా రాజకీయ డ్రామానేనని వారు ఆరోపిస్తున్నారు. పైగా.. పవన్‌కళ్యాణ్ గతంలో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమయంలో.. చంద్రబాబు ఓ అధికారిక సమావేశంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. తాను పలకరిద్దామని ఫోన్‌చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని బాబు అప్పట్లో వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను చిరు అభిమానులు, కాపు నేతలు గుర్తుచేస్తున్నారు.
పవన్‌పై చిరు అభిమానులు, కాపు వర్గీయుల్లో అసంతృప్తి..
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ వ్యాఖ్యల ఎపిసోడ్‌లో పవన్‌కళ్యాణ్ వ్యవహారశైలిపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా పవన్‌కళ్యాణ్ ఆయనకు ఏదో విధంగా అండగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఆ వర్గీయుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే.. బాలకృష్ణ కామెంట్లపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారుగానీ పవన్‌కళ్యాణ్ ఇప్పటివరకు ఈ అంశంపై కనీసం నోరువిప్పలేదని.. ఇది పరోక్షంగా బాబుకు మేలు చేయడమేనని వారు గుర్తుచేస్తున్నారు.
జ్వరంతో బాధపడుతున్నందున పవన్‌కళ్యాణ్ స్పందించలేదని అనుకున్నా.. డీఎస్సీ నియామకాల అంశంలో లోకేశ్‌ను అభినందిస్తూ పవన్ ప్రకటన జారీచేశారు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా విచారం వ్యక్తంచేశారు. కానీ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల అంశంలో మౌనం దాల్చడంపై ఆ వర్గీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎమ్మెల్సీ కాకముందు వరకు చిరంజీవిపై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడే నాగబాబు కూడా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాక ఆయన కూడా తన నోటికి తాళాలు వేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
పవన్ త్వరగా కోలుకోవాలని..
ఇక పవన్ నివాసానికి చంద్రబాబు రాకపై జనసేన పార్టీ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్‌కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు పరామర్శించారని పేర్కొంది. ఈ సందర్భంగా.. మెగా డీఎస్సీ నియామకాలపైనా, అక్టోబరు 16న ప్రధాని రాష్ట్ర పర్యటనపైన, 4న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిపింది.
టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే..
బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌ను పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ఇందుకు తనవంతుగా బాబుకు తోడ్పాటు అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే, చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజికవర్గంలో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని వారంటున్నారు.