సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పచ్చ పార్టీ నేత ఒకరు రెచ్చిపోయారు. విద్యుత్ శాఖ ఉద్యోగిని బూతులు తిడుతూ.. అతడిని చెట్టుకు కట్టేసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ నేత బెదిరింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల ప్రకారం.. హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ఉద్యోగి ఎజాజ్‌పై టీడీపీ నేత రంగారెడ్డి రెచ్చిపోయారు. తన పొలంలోనే విద్యుత్ స్తంభాలు వేస్తావా అంటూ ఉద్యోగిపై ఆవేశంతో ఊగిపోయారు. ఎజాజ్‌ను బూతులు తిడుతూ తనను చెట్టుకు కట్టేసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ నేత రంగారెడ్డికి విద్యుత్ శాఖ ఏఈ జయవర్ధన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు.
దీంతో.. టీడీపీ నేత రంగారెడ్డి, ఏఈ జయవర్ధన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని లైన్‌మెన్ ఎజాజ్ సెల్ఫీ విడియో విడుదల చేశారు. తనను ఆదుకోవాలని, ఈ ఘటనపై స్పందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు. కాగా, టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి చిలమత్తూరు మండలంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


