గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

● 150 కేజీల గంజాయి స్వాధీనం

కోదాడ: ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాష్ట్ర ఈగల్‌ఫోర్స్‌, కోదాడ పట్టణ పోలీసులు శనివారం కోదాడ బైపాస్‌ రోడ్డులో పట్టుకున్నారు. నిందితుల నుంచి 150 కేజీల(62 ప్యాకెట్లు) గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన సెల్వ సూర్య, రాజగౌండర్‌ మురుగన్‌ ఒడిశాలో రాజు అనే వ్యక్తి వద్ద గంజాయి తీసుకొని కారులో బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ గంజాయిని బెంగళూరులో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొని తమకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారని నిందితులు ఒప్పుకున్నారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

పిడుగుపాటుతో

గొర్రెల కాపరి మృతి

పెన్‌పహాడ్‌ : పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండలం మాచారం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాచారం గ్రామానికి చెందిన దూబని నాగరాజు(31) శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని రాయి చెరువు వద్ద గొర్రెలకు కాపలాగా వెళ్లాడు. రాత్రి కురిసిన వర్షానికి సమీపంలో పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. పిడుగు శబ్ధానికి గొర్రె మంద చెల్లాచెదురుగా వెళ్లాయి. మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

హత్యాయత్నం కేసులో

నిందితుడి రిమాండ్‌

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు జోగు శ్రీనివాస్‌పై దాడి చేసిన జినుకల జయసూర్యను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ జగన్‌ తెలిపారు. ఈ నెల 27న ఇందిరమ్మ ఇళ్ల విషయమై జినుకల జయసూర్య 9వ వార్డు వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ విషయమై జోగు శ్రీనివాస్‌, జినుకల జయసూర్య మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జయసూర్య ఆవేశంతో జోగు శ్రీనివాస్‌పై దాడి చేసి అతడి తలను సీసీ రోడ్డుకు బాదడంతో తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లాడు. జోగు శ్రీనివాస్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జయసూర్యపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చి నల్లగొండ జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మత్స్యకారులకు

ముగిసిన శిక్షణ

కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులు, మత్స్యకారులకు దేశవాళీ తెల్లచేపల పెంపకంపై ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారంతో ముగిసింది. ఈ శిక్షణలో ఖమ్మం, ఆసిఫాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌ జిల్లాల మత్స్య రైతులు పాల్గొనగా.. ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం ఫార్మర్‌ డీన్‌ రవీంద్రకుమార్‌రెడ్డి పలు అంశాలపై అవగాహన కల్పించారు. దేశవాళీ చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, తదితర అంశాలను వివరించగా.. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement