రామగిరి (నల్లగొండ): నల్లగొండ ఆర్టీసీ డిపోలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటలకు మెరుపు సమ్మెకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా డ్రైవర్లను విధుల నుంచి తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిపో ప్రాంగణంలో నిరసన చేపట్టారు. జేబీఎం, సిస్కాన్ మ్యాన్‌పవర్ సంస్థల వైఖరిని ఎండగడుతూ.. డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు బస్సులు తిప్పేదే లేదని స్పష్టం చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాజమాన్యం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా కొందరు డ్రైవర్లను డ్యూటీలకు దూరంగా ఉంచారని కార్మికులు ఆరోపించారు. తొలగించిన డ్రైవర్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగే తమ వేతన పెంపుతో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు డిమాండ్ చేశారు.
చర్చలు సఫలం..
జేబీఎం, సిస్కాన్ మ్యాన్‌పవర్ యాజమాన్య ప్రతినిధులు డ్రైవర్లతో చర్చలు జరిపారు. తొలగించిన డ్రైవర్లను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వేతన పెంపుతో పాటు ఇతర డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు విధుల్లో చేరడంతో బస్సు సర్వీసులు యథావిధిగా నడిచాయి.
కొందరిని అకారణంగా విధుల్లోంచి తొలగించారని ఆగ్రహం
నల్లగొండ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన
చర్చలు సఫలం కావడంతో
పునఃప్రారంభమైన బస్సు సర్వీసులు


