సాక్షి, యాదాద్రి : జిల్లాలో జ్వరాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్య పరీక్షల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై సాక్షి దినపత్రికలో గురువారం జ్వరాల వరుస శీర్షికన ప్రచురించిన ప్రత్యేక కథనానికి కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం స్పందించారు. టి–హబ్ (తెలంగాణ డయాగ్నస్టిక్స్) కార్యక్రమం కింద ఉచితంగా అందించే వైద్య పరీక్షల శాంపిళ్ల సేకరణ, వాటి రిపోర్టులను రోగులకు సకాలంలో అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించినందుకు గాను డీఎంహెచ్ఓ మనోహర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్ వంశీకృష్ణలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. విధుల్లో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


