యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వేద అధ్యయన కేంద్రంగా ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరి దేవస్థానం 2027 నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో కొండకు దిగువన దీక్షా పరుల మండపంలో జరుగుతున్న 26వ తెలంగాణ వేద విద్వన్మహాసభలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పాల్గొని ప్రసంగించారు. ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదకు, ఆధునిక విజ్ఞానానికి మధ్య సార్థకమైన అనుసంధానం అవసరమన్నారు. వేద విద్యా సంస్థలు, విద్వత్ సభలు గురుకులాలకు మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. యాగగిరి క్షేత్రం చాలా సుందరంగా ఉందని, ఇతర ప్రదేశాల్లో శ్రీనరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటారని, కానీ యాదగిరి క్షేత్రంలో లక్ష్మీ సమేతంగా శ్రీస్వామి వారు చాలా శాంతమైన స్వరూపంగా కనిపిస్తున్నారన్నారు. ఈ సారి వర్షపాతం కాస్త తక్కువగా ఉండటంతో ప్రజలంతా నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. వేద విద్వన్మహా సభలు నిర్వహిస్తున్న తరుణంలో వేద సభలకు సంబంధించిన పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్య మెరుగుపర్చాలన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. వేద విద్య /్ఞానాన్ని, ఏకాగ్రత శక్తిని పెంపొందిస్తుందన్నారు. అంతకుముందు ఋగ్వేదం, సామవేదం, వివిధ వేద పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గవర్నర్ మెమొంటో అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జనార్దనా సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ సాయినాథ్ శర్మ, గవర్నర్ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, ధార్మిక సలహాదారు గోవింద్ హరి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఽవైటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి భవానీశంకర్ పాల్గొన్నారు.
ఫ గవర్నర్ శివప్రతాప్ శుక్లా


