ఆత్మసంతృప్తినిస్తోంది
- 8లో
పశువులకు జబ్బు చేస్తే వేలాది రూపాయలు వెచ్చించి మందులు కొనలేక రైతులు పడే ఆవేదనను డాక్టర్ పెంటయ్య గమనించారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘పశు ఔషధ బ్యాంక్’. ఇక్కడికి చికిత్స కోసం వచ్చే వారు వైద్యుల సేవలకు మెచ్చి డబ్బులు ఇస్తుండగా.. వాటిని సున్నితంగా తిరస్కరించి, వాటికి బదులు పశువులకు అవసరమైన మందులను విరాళంగా ఇవ్వాలని ఆయన సూచించారు. అలా దాతల సహకారంతో ఔషధ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా తానే రూ.50 వేల విరాళం అందించారు. ఆయన మిత్రులు, పలువురు దాతలు వివిధ రకాల మందులు, శస్త్రచికిత్స పరికరాలు, రక్త పరీక్ష యంత్రాలను సమకూర్చారు. దాతలను ప్రోత్సహించడానికి వారి పేర్లను వైద్యశాల గోడల మీద రాయించారు.
కోదాడ: వృత్తిలో నిబద్ధత.. వైద్యంలో విశిష్టత కలిగిన డాక్టర్ పెంటయ్య పశు వైద్యంతోపాటు దాతల సహకారంతో వినూత్నంగా ‘పశు ఔషధ బ్యాంక్’ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు సైతం పంపిణీ చేస్తున్నారు. ఆదివారం కూడా వైద్యశాలను తెరిచి ఉంచుతూ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ జంతువుల చికిత్స కోసం వచ్చేవారు రెండు మూడు గంటలు వేచి ఉండాల్సిందే. పశువులకు 24/7 సేవలందించమే తమ లక్ష్యమని అంటున్నాడు వైద్యుడు పెంటయ్య. ప్రభుత్వ వైద్యుడు చిత్తశుద్ధితో వృత్తికి అంకితమై.. సేవే జీవితంగా పనిచేస్తే సామాన్యులకు ఎంత ప్రయోజనం చేకూరుతుందో చెప్పడానికి ఈ డాక్టర్ ఒక మంచి ఉదాహరణ.
కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న పెంటయ్య అందిస్తున్న సేవలకు మంచి గుర్తింపు వచ్చింది. పశువులకు, పెంపుడు జంతువులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కాళ్లు విరిగిన, ప్రమాదంలో గాయపడి వెన్నెముక విరిగిన జంతువులకు ఆయన ప్రత్యేక శస్త్రచికిత్సలు చేస్తాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న జంతువులకు చికిత్స అందించి వాటి ప్రాణాలు కాపాడుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు కాపరులు సైతం తమ గొర్రెలను చికిత్స కోసం కోదాడకు తీసుకురావడం విశేషం. నిత్యం 70 నుంచి 80 పశువులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం నుంచి సైతం పశువులు, పిల్లులు, కుక్కలను చికిత్స కోసం ఇక్కడకు తీసుకొస్తుంటారు.
పశువైద్యుడిగా మూగ జీవాలకు చికిత్స చేయడం ఎంతో సంతృప్తినిస్తోంది. అన్నదాతలకు చేతనైనంతలో సేవ చేస్తున్నాను. కోదాడ పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంక్‌కు దాతల సహకారం మరువలేనిది. దాతలు డబ్బు రూపంలో కాకుండా వైద్యశాలకు అవసరమైన మందులను అందిస్తే, పేద రైతులకు మరింత మేలు జరుగుతుంది.
– డాక్టర్ పెంటయ్య, ఏడీ,
ప్రాంతీయ పశువైద్యశాల, కోదాడ
పశువుల పాలిట దైవం.. డాక్టర్ పెంటయ్య
ఫ క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా చేస్తున్న పశువైద్యుడు
ఫ దాతల సహకారంతో ‘పశు ఔషధ బ్యాంక్’ ఏర్పాటు
ఫ రైతులకు ఉచితంగా మందుల పంపిణీ
ఫ పశు చికిత్స కోసం తెలుగు రాష్ట్రాల నుంచి
నిత్యం 80 మంది వరకు రైతులు రాక


