రెన్యువల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా?
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడ్ ఫాదర్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధిష్టానం దీపావళి పండుగ నాటికి భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న తరుణంలో తమకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మంత్రివర్గంలో ఖాళీలు భర్తీ చేసే సమయంలో తనకు పదవి ఖాయమన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని పలుమార్లు ఆయన బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కార్పొరేషన్ చైర్మన్ల పదవులపై గురి..
భువనగిరి నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్‌లు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డిని సైతం కలిసి సీనియర్లుగా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే ఆలేరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, జనగాం ఉపేందర్‌రెడ్డి, నకిరేకల్‌కు చెందిన పున్న రామలింగం తదితరులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, డైరెక్టర్ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇతర ముఖ్య నేతలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా, కొందరికి అధిష్టానం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో తమకు పదవి ఖాయమన్న నమ్మకంతో వారు ఉన్నారు.
ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి..
తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ద్వితీయ శ్రేణి నేతల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఇటీవల సహకార సంఘాల పర్సన్ ఇన్‌చార్జి పదవుల్లో కొందరికి అవకాశం దక్కింది. ఇప్పటికే మార్కెట్ కమిటీల పాలకవర్గాల్లోనూ అవకాశం ఇచ్చారు. అయితే పదవులు వచ్చిన వారు మరోసారి తమకే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. వారిని కాదనలేక ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు. మరోవైపు పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న వారి సంఖ్య ప్రతి నియోజకవర్గంలోనూ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ లోగా నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుందని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికలను జాప్యం చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో పదవులు ఆశిస్తున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లందరికీ తగిన గుర్తింపు దక్కాలని కేడర్ కోరుతోంది.
జిల్లాలో పలువురు కాంగ్రెస్ నాయకులకు దక్కిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మార్కెట్ కమిటీల పదవుల గడువు ముగిసింది. ప్రధానంగా ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రు శోభారాణి (రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్), తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతంల పదవీ కాలం పూర్తి కాగా, వారు రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఆలేరు, భువనగిరి, వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. తమ పదవిని రెన్యువల్ చేసి మరో అవకాశం ఇవ్వాలని వారు కోరుతుండగా.. వారికి దక్కుతుందో, లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ పదవుల కోసం కొత్త వారు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు
ఫ రెన్యువల్ కోసం పాత చైర్మన్ల ముమ్మర ప్రయత్నాలు
ఫ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన పదవుల పంపకం


