వీబీజీ రామ్‌జీ పనులకు ఒక్కరోజే 10,917 మంది రాక
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆలేరురూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను సంరక్షించడంతోపాటు భూగర్బ జలమట్టాన్ని పెంచేందుకు జలసిరి పథకం కింద చేపట్టే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా జలసిరి కింద శుక్రవారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో కడకంచి స్వామి భూమిలో చేపడుతున్న ఫారంపాండ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. రైతులు మునగ తోటలు పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించడంతోపాటు బోరుబావుల రీచార్జ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఆలేరు మండలం గుండ్లుగూడెంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎసిరెడ్డి మంజుల, రేణుక, డీఆర్‌డీవో నాగిరెడ్డి, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ ఆంజనేయులు, ఏపీఓ అరుణకుమారి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, యాదాద్రి : ఎల్‌నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఉపాధి హామీ పనులకు డిమాండ్ భారీగా పెరిగింది. వర్షాభావంతో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు పెద్ద ఎత్తున పనులకు వస్తున్నారు. గతేడాది ఇదే అక్టోబర్ 30వ తేదీన జిల్లావ్యాప్తంగా దాదాపు 1,500 మంది మాత్రమే కూలీలు పనులకు రాగా.. ప్రస్తుత సీజన్‌లో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 10,917 మంది కూలీలు హాజరయ్యారు.
వ్యవసాయ సీజన్ మారింది..
సాధారణంగా అక్టోబర్, నవంబర్ వ్యవసాయ పనుల సీజన్‌లో కూలీలు పొలాల్లో బిజీగా ఉంటారు. కానీ ఈసారి వర్షాలు కురవక పత్తి, వరి పంటల దిగుబడి గణనీయంగా పడిపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు ఉపాధి పనులు వరంగా మారాయి. జిల్లాలో మోత్కూరు, ఆలేరు మండలాల్లో తక్కువగా కూలీలు పనులు చేస్తుండగా.. నారాయణపురం, తుర్కపల్లి, భువనగిరి, రామన్నపేట మండలాల్లో అధిక సంఖ్యలో కూలీలు పనులకు వస్తున్నారు.
వీబీజీ రామ్‌జీ ప్రత్యేకతలు..
కూలీలకు నిరంతరం పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ పథకం వరంలా మారింది. గతంలో మాదిరిగా నిర్దిష్ట పనిదినాల పరిమితి ఉండదు, బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఎన్ని పనిదినాలైనా పనులు చేసుకోవచ్చు. జూలై 1న ప్రారంభమైన ఈ పథకం మార్చి 2027 వరకు కొనసాగుతుంది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.6,300 కోట్లు కేటాయించాయి. కూలీలు ఎంతమంది పనిచేస్తే అన్ని పనిదినాలు కల్పిస్తారు. అలాగే ఒక జాబ్ కార్డ్‌పై గరిష్టంగా 125 రోజుల పనిదినాలు కల్పిస్తుండగా.. రోజు కూలీ రూ.308కి పెరిగింది. ఇందులో రైతాంగానికి ఉపయోగపడేలా ఏకంగా 375 రకాల పనులను చేర్చారు.
జలసిరికే పెద్దపీట
భూగర్భ జలాల పెంపు, జలసిరి కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. గ్రామాల్లో ఫామ్‌పాండ్స్ (వ్యవసాయ గుంతలు) నిర్మాణాలను ముమ్మరం చేశారు. గతేడాది జిల్లాలో కేవలం 4 లేదా 5 మాత్రమే చేయగా.. ఈసారి ఇప్పటివరకు ఏకంగా 842 ఫామ్‌పాండ్స్ మంజూరు చేసి పనులు వేగవంతం చేశారు. వీటితో పాటు ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, వ్యక్తిగత సోక్‌పిట్ల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
ఫ ఎల్‌నినోను ఎదుర్కొనేలా యంత్రాంగం చర్యలు
ఫ కరువుతో ఇబ్బంది లేకుండా కూలీలకు పనులు


