సంస్థాన్ నారాయణపురం: ఇతర జిల్లాల నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తుండటంతో నల్లగొండ జిల్లా రైతులకు నష్టం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆరోపించారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి రాచకొండకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం సంస్థాన్ నారాయణపురంలో సీపీఐ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జానారెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గాల్లో లిఫ్ట్ స్కీములు పూర్తవుతున్నా దేవరకొండ, మునుగోడు ప్రాంతాలపై నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. 13 ఏళ్లు గడిచినా డిండి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదని, డిండి లిఫ్ట్‌కు రావాల్సిన 30 టీఎంసీల నీటిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ జిల్లాల మధ్య వైషమ్యాలు సృష్టించకుండా వ్యవహరించాలని సూచించారు. రాచకొండ లిఫ్ట్ స్కీంకు వెంటనే పరిపాలనా అనుమతులు, బడ్జెట్ మంజూరు చేయాలని, దీని ద్వారా 65వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు సాధనకు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజేపీ ఎంపీలు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, కురిమిద్దె శ్రీనివాస్, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ, ఏఐవైఎఫ్ రాష్ట్ర బాధ్యులు తీర్పారి వెంకటేశ్వర్లు, మంచాల సైదులు, జంగయ్య, గాలయ్య, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


