ఆలేరు రూరల్ : గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన మహిళకు గర్భసంచితో పాటు కిడ్నీని కూడా తొలగించారు వైద్యులు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కమలమ్మ 45 రోజుల క్రితం గర్భసంచి సమస్యతో ఆలేరు పట్టణంలోని అర్పిత నర్సింగ్ హోమ్‌లో చేరింది. గర్భసంచిలో కణితి ఉందని, వెంటనే తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. మూడు రోజుల క్రితం రెగ్యులర్ చెకప్ కోసం తిరిగి ఆ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్ కొన్ని పరీక్షలు, స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. దీంతో జనగామలోని ప్రైవేట్ ల్యాబ్‌లో కమలమ్మ పరీక్షలు చేయించుకోగా, శరీరంలో కుడి వైపు కిడ్నీ లేదని తేలింది. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు అర్పిత నర్సింగ్ హోమ్‌కు వచ్చి డాక్టర్‌ను నిలదీశారు. ఆపరేషన్‌కు ముందు రెండు కిడ్నీలు ఉన్నట్లు స్కానింగ్ నివేదికల్లో స్పష్టంగా ఉందని, తమకు చెప్పకుండా కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీకి కొవ్వు పేరుకుపోయిందని, దానిని కొవ్వు గడ్డ అనుకుని పొరపాటున తొలగించామని డాక్టర్ తెలిపినట్లు బాధితులు వాపోయారు. కిడ్నీని బయట విక్రయించాలనే దుద్దేశంతోనే ఆస్పత్రి వర్గాలు ఇలా కిడ్నీని మాయం చేశాయని కమలమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురువారం ఆస్పత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు ఆస్పత్రి డాక్టర్‌కు ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. బాధితురాలి వైద్య రికార్డులను పరిశీలించి, అర్పిత నర్సింగ్ హోమ్‌పై జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
ఫ ఆస్పత్రి ఎదుట బాధితురాలి
కుటుంబ సభ్యుల ఆందోళన


