భువనగిరి: సీనియర్ సిటిజన్లకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల మండల కమిటీల జాబితాను సోమవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగుంట వెంకటేశం, జిల్లా టాస్క్ సభ్యుడు కరిపే నర్సింగ్‌రావు, నాయకులు సత్యనారాయణరెడ్డి, దశరథ, నర్సింగ్‌రావు, రవీందర్, లక్ష్మీనారాయణ, రాములు, శ్రీరామ్ సత్తయ్య, రోమన్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలని వినతి
చౌటుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకోవాలని కోరుతూ పలువురు సింగిల్‌విండోల చైర్మన్లు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది క్రితమే పదవీకాలం ముగియగా ప్రభుత్వం రెండు పర్యాయాలు పొడిగించిందన్నారు. అయితే చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నామినేషన్ ప్రక్రియ ద్వారా పాలకవర్గాలను నియమించి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వెంటనే నామినేషన్ పద్ధతిని నిలిపివేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్లు చింతల దామోదర్‌రెడ్డి, సుర్కంటి వెంకట్‌రెడ్డి, జి.బాలచందర్, కందాటి భూపాల్‌రెడ్డి, వి.లక్ష్మీనర్సయ్య, దౌడ యాదిరెడ్డి, డి.రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
యాదగిరిగుట్ట: బయో సైన్స్‌లో మెళకువలను విద్యార్థులకు అర్థమయ్యే రితీలో బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బయో సైన్స్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బయో సైన్స్ ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శరత్ యామిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి వెల్లంకిలో మద్యం అమ్మకాలు నిషేధం
రామన్నపేట: అఖిలపక్షం తీర్మానం మేరకు మంగళవారం నుంచి వెల్లంకి గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధమని, దీనికి అందరూ సహకరించాలని సర్పంచ్ ఇడెం రాధాశ్రీనివాస్ కోరారు. మద్యం అమ్మకాల నిషేధానికి మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం వెల్లంకిలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం నిర్ణయానికి వ్యతిరేకంగా మద్యం అమ్మితే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవనగంటి నాగేష్, బర్ల గణేష్, పాశం సతీష్, నకిరేకంటి నరేందర్, వీఓఏ విజయలక్ష్మి, ఆవనగంటి మల్లేశం, శ్రీనివాస్, మహేష్, తాటిపాముల శ్రీశైలం, నవీన్, చెరుపల్లి శ్రవన్, పాలెం స్వామి పాల్గొన్నారు.


