ఆస్తులపై హక్కులు | - | Sakshi
Sakshi News home page

ఆస్తులపై హక్కులు

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

జాబితాలో ఇక

సర్వే నంబర్‌ మాత్రమే

‘22 ఏ’ జాబితా ప్రక్షాళన

సాక్షి, యాదాద్రి: ఏళ్ల తరబడి తమ సొంత ఇళ్లను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు కాక అవస్థలు పడుతున్న వేలాది మంది ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వివాదాస్పద 22 ఏ (నిషేధిత భూముల) జాబితాలోని ఇళ్లు, ఇళ్ల స్థలాలకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సవరణ ప్రక్రియకు తెరతీసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.

సవరణకు ఉపక్రమించిన ప్రభుత్వం

జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 319 రెవెన్యూ గ్రామాలు, 422 గ్రామ పంచాయతీల్లో 22 ఏ నిషేధిత జాబితాను రూపొందించారు. ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలను అడ్డుకునే లక్ష్యంతో రిజిస్ట్రేషన్‌ చట్టం 1908, సెక్షన్‌ 22 ఏ కింద అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌, ఇనామ్‌, అటవీ భూములతో పాటు చెరువులు, రోడ్లను ఇందులో చేర్చారు. అయితే, ఈ క్రమంలో 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమి (కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లు, పట్టా భూములు) కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ జాబితాలో చేరాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం సవరణలకు ఉపక్రమించింది.

జీఓ నంబర్‌ 59 తరహాలోనే..

నిషేధిత జాబితాలో ఉండిపోయిన ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రజలకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ 59 తరహాలోనే, కొత్తగా మరో జీఓను తీసుకువచ్చి నామమాత్రపు ధరకు భూమిని అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌

నిషేధిత భూముల వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా లెక్కలు తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు, వాటి విస్తీర్ణం, బాధిత రైతుల సంఖ్యను బయటకు తీస్తోంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తాము కూడా అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తూ విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు భువనగిరి కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది రెండు రోజులుగా సవరణలు చేస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్లను తొలగించారు. అధికారిక పోర్టల్‌లో కేవలం సర్వే నంబర్‌, అందులో ఎంత భూమి ఉందన్న వివరాలు మాత్రమే ఉంచుతున్నారు. దీనివల్ల, గతంలో మాదిరిగానే ఇంటి నంబర్‌ ఆధారంగా సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ప్రజలకు కలగనుంది.

ఫ నిషేధిత జాబితా నుంచి కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్‌ తొలగింపు

ఫ ఇకపై కేవలం సర్వేనంబర్‌, భూమి విస్తీర్ణం వివరాలు మాత్రమే

ఫ రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరిలో ప్రయోగాత్మకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement