నకిరేకల్ : నలభై రెండేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంపునకు ఎంతగానో శ్రమించిన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కుల్‌లో బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ముస్కు కవిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. కవిత 1985లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించి శాలిగౌరారం మండలం రామగిరి ప్రాథమిక పాఠశాలలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ మండలం నడిగూడెం, చందుపట్ల పాఠశాలల్లో పనిచేశారు. 2005 స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి రావడంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి జెడ్పీ హైస్కూల్‌కు బదిలీ అయ్యారు. 2009లో అక్కడ నుంచి నకిరేకల్ జెడ్పీ హైస్కూల్‌కు బదిలీపై వచ్చారు. 2018లో స్వగ్రామైన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కూల్‌లో చేరారు. మరో రెండు నెలల్లో పదవి విరమణ పొందనున్న సమయంలో తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.


