ఉత్తమ జాబితాపై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ జాబితాపై ఉత్కంఠ

Sep 4 2026 2:42 AM | Updated on Sep 4 2026 2:42 AM

పరిశీలనలో కీలక అంశాలు ఇవే..

సాక్షి, యాదాద్రి : సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను సముచితంగా గౌరవించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అవార్డుల ప్రదానోత్సవం చేపట్టింది. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఉత్తముల జాబితా ఇప్పటికే కలెక్టర్‌కు చేరింది. ఆయన సంతకం కాగానే అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. విశేష సేవలు అందించిన బోధకులను గుర్తించి సత్కరించే ఈ ప్రక్రియలో పారదర్శకంగా నిబంధనలు పాటించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఎంపికలో ఆరోపణలు..

మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఎంఈఓల ఆధ్వర్యంలోని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను డీఈఓ కార్యాలయానికి పంపించింది. వీటిలో నుంచి జిల్లా స్థాయి కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. అయితే, ఈ ఎంపికల్లో లోపాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో కనీస సమన్వయ సమావేశం నిర్వహించకుండానే పేర్లను ఖరారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఈ అవార్డుల ఎంపికపై పలు వివాదాలు చెలరేగాయి. గతేడాది ప్రకటించిన తొలి జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో చాలామంది పేర్లను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఒత్తిళ్ల కారణంగా చివరి నిమిషంలో మరో 15 నుంచి 20 మంది పేర్లను జాబితాలో చేర్చడం వంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి.

కలెక్టర్‌ ఆమోదమే తరువాయి..

జిల్లా ఎంపిక కమిటీ రూపొందించిన ఉపాధ్యాయుల ప్రతిపాదనలను కలెక్టర్‌ ముందుంచారు. ఆ యన జాబితాను సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలుపుతారు. బడ్జెట్‌ పరిమితులు, నిబంధనల దృష్ట్యా ప్రతి కేటగిరీలో (స్కూల్‌ అసిస్టెంట్‌, పండితులు, హెడ్‌ మాస్టర్లు, ఎస్‌జీటీలు, పీఈటీలు) నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే అవార్డులను ఖరారు చేస్తారు. అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు అవార్డు గ్రహీతల వివరాలను గోప్యంగా ఉంచుతారు.

వేడుకలకు అరకొర నిధులు

టీచర్స్‌ డే సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే, మండలాల వారీగా వేడుకలకు రూ.5 వేలు, జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి కేవలం రూ.15 వేలు మాత్రమే మంజూరు చేయడం గమనార్హం.

ఫ తుది దశకు చేరిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక

ఫ కలెక్టర్‌ ఆమోదం కోసం వేచిచూస్తున్న విద్యాశాఖ

ఫ ఎంపికలో ఏఐ, డిజిటల్‌ బోధన,

వందశాతం ఉత్తీర్ణతకు ప్రాధాన్యం

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం పలు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పదో తరగతి, వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత, 9+ జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య, ‘బడిబాట’ ద్వారా విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడం లాంటివి పరిశీలిస్తున్నారు. అలాగే బోధనలో ఏఐ, డిజిటల్‌ విద్యా విధానాల వినియోగం, సరళమైన బోధనా సామగ్రి, రూపకల్పన, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి దాతల సాయం తీసుకురావడం, సైన్స్‌ఫేర్లు, కిచెన్‌ గార్డెన్‌ పెంపకం, క్రీడల్లో ప్రోత్సాహం వంటి అంశాలకు మార్కులు కేటాయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement