కేటీఆర్‌ మందలించలేదు.. ఎవరితోనూ విభేదాలు లేవు | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ మందలించలేదు.. ఎవరితోనూ విభేదాలు లేవు

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

సాక్షి, యాదాద్రి : బీఆర్‌ఎస్‌ పార్టీలో అందరిని కలుపుకుని ముందుకుపోతామని ఎవరితోనూ విభేదాలు లేవని డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి ఉన్నామని పేర్కొన్నారు. పార్టీకి, కేసీఆర్‌ కుటుంబానికి తాము ఎల్లప్పుడు విశ్వసనీయంగా ఉంటామని చెప్పారు. టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ తమను మందలించలేదని, కేసీఆర్‌, కేటీఆర్‌ తమ పట్ల ఆప్యాయతగా ఉంటారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటీ చేయలేదని, తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక

ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కోక వేణు ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 3న భువనగిరిలో జరిగిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్న ఆయన బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్‌ మూడు క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చారు. దీంతో వేణును రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కోక వేణును ఎంఈఓ రాందయాకర్‌రెడ్డి, టీఎస్‌ యూటీఎఫ్‌ మండల శాఖ ప్రతినిధులు అభినందించారు.

వైభవంగా ఊంజల్‌ సేవోత్సవం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాన్ని ఆచార్యులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఆండాల్‌ అమ్మవారిని ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవాన్ని జరిపించారు. మహిళా భక్తులు మంగళహారతులతో సేవకు స్వాగతం పలికారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement