రామన్నపేట : యాభై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి భవనం నేడు శిథిలావస్థకు చేరింది. భవనాల పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. వర్షం వస్తే చాలు గదుల్లోకి నీరు చేరుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, వార్డుల్లో రోగులు ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
ఎనిమిది మండలాలకు పెద్దదిక్కు
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి భవనాలను 1970లో నిర్మించారు. అప్పటి ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 30 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. కాలక్రమంలో దీని స్థాయిని 50 పడకలకు పెంచారు. రామన్నపేటతో పాటు నకిరేకల్, మునుగోడు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల ప్రజలకు ఈ ఆస్పత్రే పెద్దదిక్కు. ఇక్కడికి నిత్యం 400 మంది వరకు రోగులు ఓపీ కోసం వస్తుంటారు.
స్థాయి పెంచాలి.. కొత్త భవనాలు కట్టాలి
నిత్యం వందలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న రామన్నపేట ఆస్పత్రి స్థాయిని మరింత పెంచి, శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలన్న డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే మౌలిక వసతులు కల్పించడం అత్యవసరం. జూలై 12న రామన్నపేటలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఆస్పత్రి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, నెలలు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నెల 5న నకిరేకల్‌లో వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రామన్నపేట ఆస్పత్రి నూతన భవనాలకు కూడా నిధులు మంజూరు చేస్తారనే ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఫ 55 ఏళ్ల నాటి భవనం.. నిత్యం భయంభయం
ఫ నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్
ఫ నేడు నకిరేకల్ రానున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఫ నిధులు ప్రకటిస్తారని ప్రజల్లో ఆశ


