నల్లగొండ : ఆక్షన్ ప్యాడీకి సంబంధించి నల్లగొండ జిల్లాలో డిఫాల్ట్ అయిన ఏడు మిల్లుల నుంచి బకాయిలను వెంటనే వసూలు చేసుకోవాలని, అంతేకానీ క్రమం తప్పకుండా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇచ్చే మిల్లుర్లను తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేయొద్దని జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు అధికారులను కోరారు. బుధవారం నల్లగొండలోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రూ. 190 కోట్ల బకాయిలు ఏడు మిల్లులవే..
2014 నుంచి 2022 వరకు జిల్లాలో కేవలం ఆక్షన్ ప్యాడీకి సంబంధించి ఏడు మిల్లులు మాత్రమే డిఫాల్ట్‌లో పడ్డాయని వారు వివరించారు. జిల్లాలో మొత్తం రూ.600 కోట్లకు గాను ఇప్పటికే మిల్లర్లు రూ.420 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ.190 కోట్లు ఆ ఏడు మిల్లుల నుంచే రావాల్సి ఉందన్నారు. 2023 నుంచి ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని తీసుకుని గడువులోగా తిరిగి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే 2025–26 రబీ సీజన్‌లో తమ మిల్లుల కెపాసిటీని మించి రెట్టింపు ధాన్యాన్ని అధికారులు బలవంతంగా అప్పగించారని తెలిపారు. ఆ సమయంలో రబీలో రా రైస్ ఇస్తే నూకలు వస్తాయని, బాయిల్డ్ రైస్ ఇస్తామని చెప్పడంతో అధికారులు అంగీకరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎఫ్‌సీఐ రా రైస్ మాత్రమే కావాలని మెలిక పెట్టగా, తాము ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు విన్నవించిన అనంతరం బాయిల్డ్ రైస్ తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ రా రైస్ ఇవ్వాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా గడువు ఉంది..
తమకు సీఎంఆర్ చెల్లించేందుకు ఇంకా గడువు ఉందని, ఈలోపు లోటున్న బియ్యాన్ని సొంతంగా ధాన్యం కొనుగోలు చేసి అయినా ప్రభుత్వానికి అప్పగిస్తామని, బకాయిల పేరిట డబ్బులు కట్టాలని ఒత్తిడి తేరాదని కోరారు. అధికారులు తనిఖీల పేరిట వేధిస్తే వచ్చే సీజన్ నుంచి ధాన్యం తీసుకోమని, అవసరమైతే మిల్లులను బంద్ చేసుకుంటామని హెచ్చరించారు. ఏళ్ల తరబడి మిల్లర్లకు రావాల్సిన వర్కింగ్ ఛార్జీలతో పాటు రవాణా ఛార్జీలు, డ్యామేజ్, కస్టోడియన్, హమాలీ తదితర బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఇంద్రారెడ్డి, శ్రీను, వీరమల్లు, రమణ, వెంకన్న, విశ్వనాథం, యాదగిరి, శ్రీనివాస్, కేశవరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఫ డిఫాల్ట్ మిల్లులపై చర్యలు తీసుకోండి
ఫ సక్రమంగా ఉన్నవారిని వేధించొద్దు
ఫ గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇస్తాం
ఫ నల్లగొండ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్


