యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారు అద్దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. హైదరాబాద్‌లోని మూసాపేటకు చెందిన కె. అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. అక్కడి తులసీ కాటేజీలో విడిది చేసిన వారు బుధవారం ఉదయం కారులో సత్యనారాయణస్వామి వ్రతం చేయించేందుకు వెళ్లారు. కారును వాహన పూజల సమీపంలో పార్కింగ్ చేశారు. వ్రతం పూర్తయ్యాక తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు కారు సైడ్ అద్దం పగులగొట్టి అందులోని అర తులం బంగారు ఆభరణం, రూ.6,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు అంజయ్య వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీప ప్రాంతాల్లో గాలించగా, అంజయ్య కుటుంబ సభ్యులకు చెందిన ఖాళీ పర్సును చెట్ల పొదల్లో పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు చోరీలు జరగడంతో భక్తుల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది.
పర్యవేక్షణ లోపమే కారణమా?
గతంలో ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుని పార్కింగ్‌ను పర్యవేక్షించేవారు. కానీ యాదగిరి కొండ దిగువన ఉన్న సెంట్రల్ పార్కింగ్‌ను ఆరు నెలలుగా దేవస్థానమే స్వయంగా నిర్వహిస్తోంది. అక్కడ ఎలాంటి పర్యవేక్షణ, సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫ యాదగిరీశుడి సన్నిధిలో మరో ఘటన


